- సుమారు 2లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ
- ముంపు బాధితులందరికీ అందిస్తాం
- రేషన్ కార్డు లేకుంటే ఆధార్ నమోదు ద్వారా పంపిణీ
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
విజయవాడ(చైతన్యరథం): విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం నుంచీ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడిరచారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నో వరదలను చూశామని కాని ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేసి సహాయ చర్యలు కొనసాగిస్తోందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం 10 గం.ల నుండి విజయవాడలోని 179 వార్డు సచివాలయలు, రూరల్లోని 3 గ్రామ సచివాలయాల పరిధిలో వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి పాయలు, 2 కిలోల బంగాళా దుంపలను రెండు సంచుల్లో వేసి పంపిణీ చేస్తామన్నారు. ముందుగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీని చేపట్టి, తరువాత మిగిలిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఈ పోస్ మిషన్లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి పంపిణీ చేస్తామన్నారు. ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.
ఇప్పటికే సుమారు 2 లక్షల మంది బాధితులను గుర్తించామని మంత్రి మనోహర్ వెల్లడిరచారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందిస్తామని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు.
విజయవాడలో 12 ప్రాంతాల్లో గ్యాస్ సర్వీసు కేంద్రాలు
వరదలకు దెబ్బతిన్న బాధితులకు గ్యాస్ స్టవ్ మరమ్మత్తుకు సంబంధించిన ఉచిత సేవలు అందించేందుకు బిపిసిఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి కంపెనీల ఆధ్వర్యంలో 12 ప్రాంతాల్లో ఉచిత సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని మంత్రి మనోహర్ చెప్పారు.