వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై “కోడికత్తి” దాడి ఘటన వెనుక.. ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఈ ఘటనకు పాల్పడ్డ జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుకు టీడీపీతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌కు NIA కౌంటర్ ఫైల్ చేసింది. ఇప్పటికే తాము విచారణ జరిపి.. ఛార్జిషీటు కూడా దాఖలు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి లోతైన విచారణ జరపాలన్న పిటీషనర్ జగన్ రెడ్డి విజ్ణప్తిని తోసిపుచ్చింది. ఇదంతా టైం దండగ వ్యవహారంలా భావిస్తున్న NIA అధికారులు.. జగన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టేయాలని కోర్టుకు విజ్ణప్తి చేశారు.
ఇక.. జగన్ పై జరిగిన కోడికత్తి దాడిలో ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ యజమానికి కూడా ఎలాంటి సంబంధం లేదని NIA క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా కోడికత్తి శ్రీనుకు టీడీపీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు సైతం తప్పని పేర్కొంది. గత వాయిదా సందర్భంగా సీఎం జగన్ తరపు న్యాయవాది కోర్టులో రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. తన క్లైంట్ జగన్ రెడ్డి విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని… అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో NIA విఫలమైందని ఆరోపించారు. దీనిపై విచారణ పూర్తి స్థాయిలో చేపట్టేలా NIAను ఆదేశించాలని ఈ పిటిషన్లలో కోరారు.
అయితే.. కోడికత్తి కేసులో కుట్ర అంతా వైసీపీ నేతలదే అని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ఆనాడు జగన్ పై ఎలాంటి దాడి జరగలేదని.. అదంతా ఎన్నికల్లో సానుభూతి కోసం ఆడిన నాటకం అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే జగన్ రెడ్డి ఈ కేసు నుంచి బయట పడటానికి ఇలా కొత్త నాటకాలు ఆడుతున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు.. ఎయిర్ పోర్టులో జగన్‌పై దాడి చేసిన నిందితుడు జనపల్లి శ్రీను నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ విచారణ చేయించాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ విచారణ జరిపి చార్జిషీటు దాఖలు చేసింది. అయితే విచారణ ప్రారంభమయ్యే సమయంలో దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని జగన్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద కోడికత్తి కేసును సాకుగా చూపి.. సీఎం జగన్ రెడ్డి రాజకీయంగా బాగానే లబ్దిపొందారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.