హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు దాటినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో అందలేదని తెలంగాణ టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్నారు. సకాలంలో పుస్తకాలు రాకపోవడంతో తరగతుల బోధన నెమ్మదిగా సాగుతోంది. అడపా దడపా వచ్చిన పుస్తకాలతోనే సర్దుబాటు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక, మరి కొన్ని పాఠశాలలో పుస్తకాలు లేక తరగతుల బోధన ముందుకు సాగడం లేదని అన్నారు. ఆంగ్ల మాధ్యమం జాప్యంతో జిల్లాలకు ఇంకా పుస్తకాలు చేరుకోలేదు. అధికారులు చెబుతున్న మాటలు నీటి మీద రాత లానే మిగిలిపోయాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుస్తకాలు లేకుండా ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. కరోనా కారణంగా ఇప్పటి వరకు విద్యార్థులు క్లాసులు ఆన్‌లైన్‌లో విన్నారు. పుస్తకాలు లేకున్నా ఉపాధ్యాయులు చెప్పేది విని, రాసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు తప్పనిసరగా అవసరం ఉంటాయి అన్నారు. ఇళ్ల వద్ద చదువుకోవడం, హోం వర్క్ చేయడం ఇబ్బందికరంగా మారిందని అన్నారు. పుస్తకాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలి టిఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం