నరసన్నపేట (చైతన్యరథం): తెలుగుదేశం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావం సభల్లో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నరసన్నపేటలో పసుపు జెండా ఎగరడం ఖాయమన్పిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నరసన్నపేట శంఖారావం సభలో మాట్లాడుతూ `యువగళం మన ప్రాంతానికి వస్తుందని అందరం ఎంతో ఆశతో ఎదురుచూశాం. వైసీపీ కుట్రలతో పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కారణంగా యువగళం ఇక్కడికి రాలేకపోయింది.
అందుకే `ప్రతి కార్యకర్తకూ భరోసా ఇచ్చేందుకే శంఖారావం సభతో యువనేత లోకేష్ మన ముందుకు వచ్చారు. లోకేష్ మలి యాత్రతో రాష్ట్రానికి పట్టిన తుప్పు, పీడ, శని.. వైసీపీ వైరస్ మొత్తం వదిలిపోతుంది అన్నారు. అందుకు టీడీపీ -జనసేన కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాణాలు ఫణంగా పెట్టిన కార్యకర్తలు నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్నారని పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. 2014-19 నడుమ చంద్రబాబు రేయింబవళ్లు పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, 180 కోట్లతో సారవకోట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్, బుడితి వద్ద వాటర్ స్కీమ్ ఏర్పాటు చేసుకోగలిగామన్నారు.
టీడీపీ హయాంలో కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం. ఆ అభివృద్ధిమీద పబ్బం గడుపుకోవడం తప్ప, తర్వాత వచ్చిన వైకాపీ ఎమ్మెల్యే, డిప్యూటీ సిఎం ఒక్క పనీ చేపట్టలేకపోయారన్నారు. ఐదేళ్లుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న చందంగా నియోజకవర్గం తయారైందన్నారు. మనం చేపట్టిన అభివృద్ధి పనులను నిస్సిగ్గుగా రంగులు వేయడం తప్ప, ప్రస్తుత ప్రజా ప్రతినిధి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. వైసీపీ చేసిన పనల్లా `నరసన్నపేటను కబ్జాల్లో ముందువరసలో పెట్టారని, చెరువులనూ మింగేశారని దుయ్యబట్టారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ అక్రమార్కుల పరిస్థితి శంకరగిరి మాన్యాలేనన్నారు. జగన్ పాలనలో ఏపీ వాళ్లం అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందని, రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితి కల్పించారన్నారు. మళ్లీ రైతురాజ్యం రావాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి పునాది వేసింది విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ అని గుర్తుచేస్తూ, మన ప్రభుత్వం వచ్చాక వారికి గతంలో మాదిరి సంక్షేమ కార్యక్రమాలన్నీ పునః ప్రారంభిద్దామని హామీ ఇచ్చారు. అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు.
ఇప్పుడు మన పాస్‌బుక్‌లపై జగన్ ఫొటో వేసుకుంటున్నాడని ఎద్దేవా చేస్తూ, ఆ రోజు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగదుద్దులు గుద్దుతున్నాడని, మళ్లీ గెలిపిస్తే ఆస్తులు నావేనని లాక్కునే ప్రమాదముందని ఎద్దేవా చేశారు. కల్తీసారా సాగి రాష్ట్రంలో 40వేలమంది అమాయక ప్రజలు బలయ్యారని చెప్తూ, నేరాల్లో ఏ1గా ఉన్న వ్యక్తి సీఎంగా ఉంటే రాష్ట్రానికి ఉనికి ఉంటుందా? అని ప్రశ్నించారు. స్పెషల్ కోర్టులు పెట్టి జగన్ లాంటి దుర్మార్గులను శిక్షించాలని పార్లమెంటులో కోరానన్నారు. యర్రన్నాయుడుకి ఎంతో ప్రీతిపాత్రమైన నియోజకవర్గం నరసన్నపేట అని అంటూ, నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని రామ్మోహన్ ప్రామిస్ చేశారు.
టీడీపీలో కార్యకర్తకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. ఎవరు కష్టపడి పనిచేస్తే వారికి నారా లోకేష్ తప్పనిసరిగా న్యాయం చేస్తారంటూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు`పవన్ కళ్యాణ్‌లకు మనమే సైన్యం కావాలని పిలుపునిచ్చారు.