- పందికొక్కులా బియ్యం బొక్కి నీతి కబుర్లా
- తల్లకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేరు
- భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గు చేటు
- బియ్యం కుంభకోణం సూత్రధారి, పాత్రధారి పేర్ని నానియే
- మంత్రి కొల్లు ధ్వజం
మచిలీపట్నం (చైతన్యరథం): వైసీపీ నాయకుడు పేర్ని నాని తల్లకిందులుగా తపస్సు చేసినా బియ్యం కుంభకోణం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం మీడియాతో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. దొంగతనం చేసి డబ్బులు కట్టేసినంత మాత్రాన దొర అయిపోతారా అని ప్రశ్నించారు. పేదలకు చెందాల్సిన 7,577 బస్తాల బియ్యాన్ని పందికొక్కులా బొక్కి ఇప్పుడు నీతులు మాట్లాడ్డానికి సిగ్గుపడాలన్నారు. సీఎం చంద్రబాబు మమ్మల్ని ఏదో అన్నారంటూ అభూతకల్పనలతో డ్రామాలాడడానికి బుద్ధి ఉండాలని హెచ్చరించారు. భార్యపేరుతో గోదాము ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. బియ్యాన్ని బొక్కేసి మహిళలపై కేసులు పెడుతున్నారంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారన్నారు. తప్పు చేస్తే మహిళల్ని అరెస్టు చేయకూడదని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. మహిళల్ని అరెస్టు చేయొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని వారించారని పేర్ని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఇలాంటి నీతిలేని రాజకీయం చేస్తున్నందుకు పేర్ని నాని సిగ్గుపడాలన్నారు. ఇంత నీచానికి తెగించిన పేర్ని నాని అసలు మనిషిపుట్టుక పుట్టాడా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. భార్య పేరును వాడుకుని రాజకీయం చేయాలనుకోవడమే తప్పు, అలాంటిది ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం మరింత నీచం అన్నారు. ఈ బియ్యం కుంభకోణం మొత్తానికి సూత్రధారి, పాత్రధారి పేర్ని నానియే అన్నారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుండి తప్పించుకోవడం అసాధ్యం అన్నారు. తప్పు చేశారు కాబట్టే నెల రోజులుగా కుటుంబం మొత్తం తప్పించుకు తిరుగుతోందని మంత్రి కొల్లు దుయ్యబట్టారు.
ఈ బుద్ధి నాడేమయింది..
ఈ రోజు మహిళల ఆత్మగౌరవం, మహిళలపై కేసులు గురించి మాట్లాడుతున్న పేర్ని నాని నాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి నీచంగా వ్యాఖ్యానించినపుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై కేసులు పెట్టి, స్టేషన్ల చుట్టూ తిప్పి, జైల్లో పెట్టినపుడు ఆ గుణం ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా వృద్ధుల్ని కూడా అరెస్టు చేసినపుడు పేర్ని నాని ఏ కలుగులో ఉన్నాడో సమాధానం చెప్పాలన్నారు. నోరుందని ఇష్టానుసారం వాగితే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఐదేళ్ల పాటు చేసిన పాపాలు పండాయి, అందుకే ఈ రోజు ఇలా భయంతో వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు. గోడౌన్ మేనేజరే మొత్తం చేశాడని చెబుతున్న పేర్ని నాని అతన్ని ఎందుకు దాచిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. గతంలో నా అనుచరుల కాళ్లు కట్టి వేలాడదీసి, నాపై కేసు నమోదు చేసినపుడు ఈ బుద్ధి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. అప్పుడు చేసిన తప్పులు, పాపాలు గుర్తొచ్చి ఇప్పుడు భయపడుతున్నారన్నారు. కర్మఫలం నుండి ఎవరూ తప్పించుకోలేరనే విషయాన్ని పేర్ని నాని గుర్తుంచుకోవాలన్నారు. భగవంతుడు క్షమించినా.. చేసిన పాపాలు వదలబోవు. నిద్రలేని రాత్రులు తప్పవని మంత్రి కొల్లు స్పష్టం చేశారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు
చనిపోయిన తల్లిపై ప్రమాణం చేయడానికి పేర్ని నాని సిగ్గుపడాలి. గతంలో పెద్దపట్నం పోర్టు గురించి తల్లిపై ఒట్టేశావ్. బందరు పోర్టు కట్టకపోతే రాజకీయాలు వదిలేస్తానని కోనేరు సెంటర్లో ముక్కు నేలకు రాశావ్. ఆ మాటలన్నీ తప్పిన పేర్ని ఈ రోజు తల్లిపై ప్రమాణం చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మా నాయకుడు చంద్రబాబు దేవుడని నువ్వు చెప్పడం కాదు.. ఆయన గురించి తెలిసిన ఏ ఒక్కరైనా అదే మాట చెబుతారు. కానీ ఆయన పేరు వాడుకుని జరగని విషయాలను జరిగినట్లు మభ్యబెట్టాలనుకోవడం సిగ్గుచేటు. దొంగతనం చేశావు. దొరికిపోయావు. ఇంకా నాటకాలెందుకని మంత్రి కొల్లు ప్రశ్నించారు.