- పంట నష్టపోయి, ప్రభుత్వం ఆదుకోక దుగ్గిరాలలో మరో రైతు కిశోర్ బాబు ఆత్మహత్య
- పది రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు తుల్లిమిల్లి బసవయ్య
- రాష్ట్రంలో అన్నదాతల దారుణ పరిస్థితులపై యువనేత ఆందోళన
- రైతులు ధైర్యంగా ఉండాలి, 3 నెలల్లో వచ్చే ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహ్యలన్నీ జగన్ సర్కార్ చేస్తున్న హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో కిశోర్ బాబు అనే రైతు ఆత్మహత్యకి పాల్పడటం రాష్ట్రంలో రైతన్నల దుస్థితికి అద్దం పడుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయి, చేసిన అప్పులు తీర్చే మార్గంలేక కిశోర్ బాబు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనతో తీవ్రవిషాదంలో మునిగిపోయానని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదిరోజుల క్రితం దుగ్గిరాలకి చెందిన రైతు తుల్లిమిల్లి బసవ పున్నయ్య ఆత్మహత్య తనని తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరువుతో కొంత, తుఫాన్‌తో పూర్తిగా నష్టపోయినా, జగన్ సర్కారు ఆదుకోకపోవడం వల్లే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఇవి జగన్ సర్కారు చేసిన హత్యలేనని లోకేష్ ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉండటం వైకాపా ప్రభుత్వం రైతన్నల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమన్నారు. రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, మూడునెలల్లో ప్రజాప్రభుత్వం వచ్చి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకి పాల్పడిన తుల్లిమిల్లి బసవపున్నయ్య కుటుంబానికి టీడీపీ సాయం చేసిందని, కిశోర్ బాబు కుటుంబానికీ అండగా ఉంటామని పేర్కొన్నారు.