- సాంకేతికత అనుసంధానిస్తే శ్రేష్ఠమైన వైద్యసేవ
- ఏపీ ఎయిమ్స్.. దేశంలోనే నెంబర్ వన్ కావాలి
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆకాంక్ష
- కేంద్ర సాయంతోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌కు పునాది
- 2019లోనే మౌలిక వసతులతో సేవలందించాం..
- రూ.10కే అందరికీ నాణ్యమైన వైద్యం
- ఎయిమ్స్‌కు మరో పదెకరాల భూమి కేటాయిస్తాం
- మొదటి స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు హామీ
అమరావతి (చైతన్య రథం): వైద్య శాస్త్రంలో సాంకేతికతను వినియోగించడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని, టెక్నాలజీ ద్వారా రోగుల చెంతకే వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్‌టెక్ సైన్స్ అయ్యిందన్నారు. డీప్టెక్వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప రోగులు ఆస్పత్రులకు రావాల్సిన అవసరం లేకుండా వైద్య చికిత్స అందించేలా వైద్యరంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని సూచించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో మంగళవారం జరిగిన మొదటి స్నాతకోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. కార్యక్రమానికి హాజరుకావడం తనకు సంతోషంగా ఉందన్నారు. స్నాతకోత్సవానికి హాజరైన వైద్య విద్యార్థులు అందరికీ ముందుగా అభినందనలు తెలిపారు.
రాష్ట్రపతి ముర్ము అందరికీ స్ఫూర్తి
ఒడిశాలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము వచ్చారని, రాష్ట్రపతి స్థాయికి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ప్రొఫెసర్‌గా, జూనియర్ అసిస్టెంట్‌గా, కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, గవర్నర్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారని.. దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని.. అంతే పట్టుదలగా కష్టపడితే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని రాష్ట్రపతి నిరూపించారని ముఖ్యమంత్రి అన్నారు.
ఎయిమ్స్‌కు సంపూర్ణ సహకారం
మంగళగిరి ఎయిమ్స్‌కు దేశంలో మరే ఎయిమ్స్‌కు లేనట్టుగా 183 ఎకరాల భూమి ఇచ్చామని, అదీ అత్యుత్తమ ప్రాంతాన్ని ఎంపికచేసి కేటాయించామని సీఎం గుర్తు చేశారు. భవిష్యత్ అవసరాల కోసం మరింత భూమిని ఇవ్వాల్సిందిగా ఇటీవల ఎయిమ్స్ అధికారవర్గాలు తనను కోరాయని, త్వరలోనే మరో 10 ఎకరాలు ఎయిమ్స్‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2018లో తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశామని, 960 బెడ్లతో రూ.1618 కోట్లతో దీనిని నిర్మించారని.. తొమ్మిదేళ్లలో మంచి గుర్తింపు సాధించడం ఆనందదాయకమని అన్నారు. ఎయిమ్స్‌కు అప్రోచ్ రోడ్లు, జాతీయ రహదారితో అనుసంధానం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరావంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, భవిష్యత్‌లో మరింతగా సహాయ సహకారాలు అందించేందకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో రోగులకు రూ.10కే వైద్య సేవలు అందించడాన్ని ఆయన అభినందించారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రస్తుతం ర్యాకింగ్‌లో దేశంలో 8వ స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో ఉండాలనేది తన ఆకాంక్షగా చెప్పారు.
ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ సహా పలు కేంద్ర విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి నగరాన్ని వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.50 వేల కోట్లు ఖర్చుచేసి అత్యద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు.
రాష్ట్రపతికి సాదర స్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.