- ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులపై చర్య
అమరావతి (చైతన్య రథం): అనూహ్య వరదలతో ప్రభావిత ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయిన తరుణంలో.. ఎలక్ట్రానిక్ కంపెనీలు తమవంతుగా సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లుచేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరదలతో ప్రజల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచి పాడైపోయాయని, కంపెనీలు సామాజిక బాధ్యతతో ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. అలాగే.. ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్లో అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్ కంపెనీల సేవల బృందాలు ఒకే వేదిక మీదకు వచ్చి సర్వీస్ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇప్పుడు మీరు స్పందించే తీరే కస్టమర్లలో మీ బ్రాండ్ నిలబడుతుంది. కంపెనీలవారిగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అదనంగా టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వారంపాటు టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కంపెనీల యాజమాన్యాలను ముఖ్యమంత్రి కోరారు. ఈ క్రమంలో.. వరద ప్రాంతాల్లో ప్రత్యేక సర్వీస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవలందిస్తామని కంపెనీల ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు.