తనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే, జ్ఞానం ఇచ్చింది ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని నల్ల మాకల కరుణాకర్ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనకి చేసిన సాయం జీవితాంతం మరువలేనని, ఆ మహానుభావుడు దయవల్ల తాను ఇప్పుడు సొంతూరు దగ్గర్లోనే నెలకి 50 వేల జీతం తీసుకునే ఉద్యోగం చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. టిడిపి తనకి చేసిన సాయానికి నారా లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా ఓజిలి మండలం మనవాలి గ్రామానికి చెందిన టిడిపి నేత నల్లమాకల కస్తూరయ్యపై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇంటి పెద్ద మంచానపడటంతో నలుగురు పిల్లలు చదువులు ప్రశ్నార్థకమయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబు 2007లో కరుణాకర్ ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించగా అక్కడే ఇంటర్ పూర్తి చేశారు. గుంటూరు నలందలో బీటెక్ అయ్యాక, శ్రీసిటీలోని కెలోగ్స్ ఫుడ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ సంపాదించారు. మెరుగైన జీతంతో ఇప్పుడు కుటుంబ బాధ్యతల్ని కూడా కరుణాకర్ చూస్తున్నారు.
తనలాగే ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు గారు విద్యావంతులుగా తీర్చిదిద్దారని, ఇదే స్ఫూర్తితో తాను నిరుపేద పిల్లలకి సాయం అందించి తెలుగుదేశం పార్టీ లక్ష్యాన్ని నెరవేరుస్తానని కరుణాకర్ చెబుతున్నారు. ఏడాదికి లక్షలు ఫీజు చెల్లించేవారితో సమానంగా తనకూ ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పి, భోజన వసతి కల్పించి, ఉన్నతోద్యోగిగా తీర్చిదిద్దిన ఎన్టీఆర్ మోడల్ స్కూల్, అందులో చేరే అవకాశం కల్పించిన నారా చంద్రబాబునాయుడు గారి ఆశయసాధనకి కృషి చేసి రుణం తీర్చుకుంటానంటున్నారు కరుణాకర్.