అమరావతి(చైతన్యరథం): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండ లం పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొండలపై మైనింగ్ లీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్‌కుమార్ నాయుడు దాసమన్నికి ఇచ్చిన 2.153 హెక్టార్ల క్వారీ లీజు రద్దుకు అనుమ తి ఇచ్చింది. 14.05.2036 వరకు ఈ క్వారీ లీజు అమలులో ఉందని.. కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిని రద్దు చేస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. పంచదార్ల కొండలపై మైనింగ్ కార్యకలాపాలకు ఇక అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాంబిల్లి మండలం పంచదార్ల పుణ్యక్షేత్ర కొండలను ఇకపై నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. గనుల తవ్వకాలతో పంచదార్ల ప్రాంత పర్యావరణ, పురావస్తు, జల వనరులు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు ముప్పు ఉందని ప్రభుత్వా నికి అధికారులు నివేదిక అందజేశారు. మైనింగ్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలు శాఖల అధికారులతో సంయుక్తంగా ఈ కొండలపై తనిఖీలు నిర్వహించారు. 6వ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణం, భూగర్భ జలాలు, పురావస్తు, మతప రమైన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వివరించింది. ఇకపై పంచదార్ల కొండల్లో ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి చర్యలు చేపట్టాలని మైన్స్ అండ్ జియాలజీ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.














