- ఆ దిశగా దూసుకెళ్తోన్న మహిళా శక్తి
- వాళ్ల వేగాన్ని సమాజం ప్రోత్సహించాలి
- వ్యవస్థలో మహిళలది ప్రభావవంతమైన పాత్ర
- ఆడబిడ్డలను లక్షాధికారులను చేసే బాధ్యత నాదీ
- డ్వాక్రాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు
- జగన్ అసమర్థ విధానాలతో రాష్ట్రానికి తీవ్రనష్టం
- సైకోను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
- సంపద సృష్టితోనే పేదల జీవితాల్లో వెలుగులు
- గజపతినగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
గజపతినగరం (చైతన్యరథం): ‘వర్తమాన వ్యవస్థలో మహిళ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తోంది. పురుషులతో మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు, దాటుకుని దూసుకెళ్తున్నారు. ఆడబిడ్డలకు పుట్టినిల్లయిన తెలుగుదేశం `మహిళల సాధికారతకు చేపట్టిన చర్యల ప్రతిఫలమే ఇది. ఈ అప్రతిహత ప్రయాణాన్ని సమాజం స్వాగతించాలి. చట్టసభల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహించే రోజులు రావొచ్చు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంపై ఉందంటూనే `ఆర్థిక దన్నునిచ్చేందుకు ఆడబిడ్డలను లక్షాధికారులను చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.
ఎన్నికల పర్యటనలో భాగంగా మంగళవారం గజపతినగరం వచ్చిన చంద్రబాబు `ప్రజాగళం సభలకు ముందు అక్కడి మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. సంపద సృష్టిలో అద్భుత ఫలితాలిచ్చిన డ్వాక్రాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడతానని హామీనిస్తూనే.. ఆడబిడ్డలకు సున్నా వడ్డీ కింద రూ.10 లక్షల రుణాలు అందిస్తానని ప్రకటించారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని పునరుద్ఘాటిస్తూ.. ఇక్కడి ఆడపడుచుల హుషారు చూస్తుంటే గజపతినగరం ఎమ్మెల్యేగా కొండపల్లి శ్రీనివాస్, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు భారీ మెజారిటీతో గెలిచినట్టే అనిపిస్తోందని ఉత్సాహంగా ప్రకటించారు.
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు
ఎన్నికలలో విజయం కోసం టక్కుటమార హామీలతో ప్రజల ముందుకొస్తున్న మాయగాళ్ల మాటలు విని మరోసారి మోసపోవద్దని పరోక్షంగా జగన్‌ను ఎత్తిపొడిచారు. 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే, బాధ్యత కలిగిన పదవిలోవున్న జగన్‌రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. మహిళలు చదువుకొని ఉన్నతస్థానాల్లో ఉండాలన్న ఆలోచనతో అన్న ఎన్టీఆర్ మహిళా వర్సిటీ స్థాపిస్తే.. ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ఆశయంతో తాను ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల , ప్రతి 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకు హైస్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్‌కూ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీతోపాటు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలకు విద్యారంగం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, ఆడబిడ్డల ఎదుగుదలకు తీసుకున్న చర్యలే ఇప్పుడు ఫలాలిస్తున్నాయని అంటూ.. ‘ఒకప్పడు ఆడపిల్లలు కట్నాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆడపిల్లలకు రివర్స్‌లో కట్నాలు ఇస్తున్నారు’ అని చంద్రబాబు చమత్కరించారు.
డ్వాక్రాను బలోపేతం చేస్తా
‘మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని డ్వాక్రా వ్యవస్థ తెచ్చాను. అధికారంలోకి రాగానే డ్వాక్రాను మరింత బలోపేతం చేసి ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తాను’ అని హామీ ఇచ్చారు. 1997లో బాలికా శిశు సంరక్షణ పథకం తెచ్చి పుట్టిన ఆడబిడ్డ పేరున రూ.5 వేలు డిపాజిట్ చేశాం. ఆ చిన్నారి పెద్దయ్యాక ఆ డబ్బుతో ఆదుకున్నాం. 8, 9, 10వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లిచ్చాం. మహిళల పేరు మీదనే ఇళ్ల పట్టాలు, రైతుబజార్లు, ఇసుక ర్యాంపుల నిర్వహణ అప్పగించాం. మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించాం. రూ.8,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేశాం. రూ.10,000 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చాం. నా ఆడపడుచులకు సమాన న్యాయం చేయాలని పదివేలిచ్చాం. కానీ జగన్‌రెడ్డి మాయమాటలు నమ్మి డ్వాక్రా మహిళలు ఐస్ అయ్యారు. ఈసారి తప్పు జరగనివ్వొద్దు, నష్టపోవద్దు’ అని హితవు పలికారు. ఐదేళ్లలో మీ ఆదాయం పెరగలేదు.
రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నాడు. నేను మీ ఆదాయంతో పాటు జీవన ప్రమాణాలు పెంచాను. వడ్డీలేని రుణాలిచ్చాను. కానీ నేడు ఆ రుణాలు ఇస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను, మహిళలకు దీపం పథకం కింద 65 లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చానని, 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు, అన్న అమృతహస్తం కింద గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం, నవజాత శిశువులకు బేబీ కిట్లు, తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్ , బాలామృతం అందించామని, సామాహిక సీమంతాలు నిర్వహించి పెళ్లికానుకలు అందచేశానని గుర్తు చేశారు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలని ‘తల్లికి వందనం’ పెట్టామని చెబుతూ, తాను మహిళాభ్యున్నతికి అమలు చేసిన 22 పథకాలను జగన్‌రెడ్డి కక్షపూరితంగా రద్దు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైకో సీఎంతో అన్నీ కష్టాలే
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని రేట్లు పెరిగిపోయాయి. మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచాడు. ధరల పెంపుతో పేద, మధ్యతరగతిని రోడ్డున పడేశాడు. ఈ ఐదేళ్లలో ఒక్కరికీ ఉద్యోగం లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. డీఎస్సీ లేదు. సైకోవల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం? జే బ్రాండ్స్ లిక్కర్, గంజాయివల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. గంజాయి తీసుకున్న వాడికి భార్య, తల్లికి తేడా తెలీదు. ఈ ఐదేళ్లలో మహిళలపై దాడులు పెరిగాయి. 80 శాతం మహిళలు అదృశ్యమయ్యారు. లైంగిక వేధింపులు 35 శాతం, దాడులు 32 శాతం పెరిగాయని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో బాదుడులేని సంక్షేమం ఇస్తానని, ఆదాయం పెంచుతానని, గజపతి నగరంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటానని, పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు.
మహాశక్తి…మహిళా శక్తి
మహిళలను ఆదుకునేందుకే సూపర్ సిక్స్ పథకాలు రూపొందించామని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో మహాశక్తి పథకానికి రూపకల్పన చేశాం. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందించబోతున్నాం. అమ్మఒడి పేరిట జగన్‌రెడ్డిలా మోసం చేయడం తెలీదు. ఎంతమంది పిల్లలుంటే అందరినీ చదివించాలని, తద్వారా వారి జీవితాలు బాగుపడతాయని ఆలోచించాను. ఆడపిల్లల రక్షణకు నేనే డ్రైవర్‌గా ఉండి నడిపిస్తా. ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులను డ్వాక్రా బజార్లు పెట్టి దేశ విదేశాల్లో అమ్మించాం. ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తాం. వచ్చే ఐదేళ్లలో అన్ని గ్రామాలు, ఇళ్లకు నీటి ఎద్దడి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం ఇస్తానన్నా జలజీవన మిషన్‌ను జగన్ సద్వినియోగం చేసుకోవడంలేదని, నీరివ్వలేని ముఖ్యమంత్రి మద్యం మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నాడని దుయ్యబట్టారు.
సంపదపంచి పేద జీవితాల్లో వెలుగులు నింపుతా
సంస్కరణల ద్వారా సంపద సృష్టి టీడీపీకే సాధ్యమని చంద్రబాబు ప్రకటించారు. పెంచిన ఆదాయం పేదలకు పంచి వారి జీవితాల్లో వెలుగులు తెసానని హామీ ఇచ్చారు. పేదరికం లేని సమాజ ఆవిష్కరణే తన థ్యేయమని చెబుతూ, రేయింబవళ్లు కష్టపడి పేదలను ఆదుకుంటానని ప్రకటించారు. అధికారంలోకి రాగానే గజపతినగరం స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మగవారితో పోలిస్తే మహిళలు తెలివైన వారు. ఇంటి ఖర్చులు `మన ప్రభుత్వంలో ఎలా ఉంది, సైకో రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉందో చెక్ చేసుకోండి. సైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంనుంచి ప్రజలు పారిపోయే ప్రమాదకర పరిస్థితులు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర పునర్నిర్మాణం సాధ్యం కావాలంటే `ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోక తప్పదని చంద్రబాబు హితవు పలికారు.