అమరావతి(చైతన్యరథం): నాలుగు దశాబ్దాలకు పైగా ఆటు పోట్లను అధిగమించి తెదేపా ముందుకు సాగటానికి అంకితభావం, నిబద్ధత, ధైర్యంతో నిండిన పార్టీ శ్రేణులే ప్రధాన కారణం. పార్టీ శ్రేణులు అన్ని ఇబ్బందులు ఓర్చుకొని భారాన్ని మోస్తేనే నాయకులు ఎన్నికల్లో గెలవగలుగుతారు. పార్టీని నిరంతరం అంటిపెట్టుకొని ఉండేది కార్యకర్తలే. అటువంటి వారికి పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ, బూత్‌స్థాయి నాయకులు, శ్రేణులకు సముచిత అవకాశాలు కల్పించి రుణం తీర్చుకుంటాను.
రాష్ట్రంలో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా -భాజపా -జనసేన కూటమి భారీ విజయం తథ్యమని, జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ విజయం కోసం కష్టించిన వారికి తగు గుర్తింపు ఇస్తామని బుధవారం ప్రకటించారు. పార్టీ నాయకులతో ఓట్ల లెక్కింపు విషయాలకు సంబంధించి సమీక్ష జరిపారు. అనంతరం, ఎన్నికలలో కష్టించి పనిచేసిన పార్టీ నాయకులు, శ్రేణులను తగువిధంగా గుర్తించి, గౌరవించే విషయంపై ఉద్విగ్నంగా మాట్లాడారు.
శ్రేణులే పార్టీకి సర్వస్వం
నాలుగు దశాబ్దాలకు పైగా ఆటు పోట్లను అధిగమించి తెదేపా ముందుకు సాగటానికి అంకిత భావం, నిబద్ధత, ధైర్యంతో నిండిన పార్టీ శ్రేణులే ప్రధాన కారణమని చంద్రబాబు శ్లాఘించారు. పార్టీ శ్రేణులు అన్ని ఇబ్బందులు ఓర్చుకొని పార్టీ భారాన్ని మోస్తేనే నాయకులు ఎన్నికల్లో గెలవగలుగుతారని అన్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఉమ్మడి, నవ్యాంధ్ర అభివృద్ధి లక్ష్యాల దృష్ట్యా పార్టీ శ్రేణులపట్ల తగినంత దృష్టి పెట్టలేకపోయామని, దానివలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవాల దృష్ట్యా ఈసారి వారి సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతామని, దీనికోసం కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. కొన్ని కారణాల వలన కొంతమంది నాయకులు అటు ఇటు పోయినా, పార్టీని నిరంతరం అంటిపెట్టుకొని ఉండేది పార్టీ కార్యకర్తలేనని.. అటు వంటి వారికి పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం అభ్యర్థుల ఎంపిక వంటి కొన్ని విషయాల్లో కొంతమేరకు వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటూ పనిచేసిందని, దీని ఫలితాలను ఓట్ల లెక్కింపు తరువాత సమీక్షిస్తామని.. ఆ మేరకు వివిధ స్థాయిల్లో పార్టీ నాయకులు, శ్రేణులను తగువిధంగా గౌరవిస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం పార్టీ కోసం కృషి చేసిన బూత్‌స్థాయి నాయకులు, శ్రేణులకు సముచిత అవకాశాలు కల్పిస్తా మని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.