- తహసీల్దారు రికార్డులు తారుమారు చేశాడు
- వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయండి
- పుంగనూరు సుగాలిమెట్ట బాధితుడి మొర
- మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేతలకు వినతి
మంగళగిరి(చైతన్యరథం): తన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు వారి పేరుపైకి మార్చుకున్నారని తనకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా పుంగనూరు సుగాలిమెట్టకు చెందిన బాధితుడు బి.రాజశేఖర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాల్యాద్రి ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుడు తన సమస్య చెప్పుకునేందుకు వచ్చాడు. తన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు స్థానిక జెడ్పీటీసీ రాజు నాయక్, అతని సోదరుడు మునిస్వామినాయక్‌లు అక్రమంగా వారి పేరుపైకి మార్చుకున్నారని తెలిపాడు. దీనిపై అప్పటి తహసీల్దార్ మాధవరాజును ప్రశ్నించగా తమను బెదిరించి రికార్డులు తారుమారు చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
తన భూమిని ఆక్రమించారు
సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లిలో తమ భూమితో పాటు చినీ చెట్లను అడపాల సురేంద్ర, శ్రీనివాస్ తదితరులు ఆక్రమించుకుని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని పసుపులేటి మంగమ్మ ఫిర్యాదు చేశారు.
2015-19లో ఎన్‌ఎస్‌ఎఫ్ డీసీ, ఎన్‌ఎస్ కేఎఫ్‌టీసీ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి జీవనోపాధి కోసం కార్లు లోనుగా తీసుకున్నామని, కరోనా సమయంలో బాడుగలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు కట్టాలని ఇబ్బంది పెట్టారని… తాము రుణం చెల్లించలేని స్థితిలో ఉన్నామని రుణమాఫీ లేదా సబ్సిడీ మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఫీజు చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు
తెనాలిలోని కేఎస్‌ఎన్ ఫార్మా కాలేజీలో చదువుతున్నానని, ఫీజు రీయింబర్స్‌మెం ట్ వర్తిస్తున్నా ప్రభుత్వం నుంచి ఫీజు రాకముందే పూర్తి ఫీజు చెల్లించాలని యాజమా న్యం తనను ఇబ్బంది పెడుతుందని నరసరావుపేటకు చెందిన కొల్లిపర లక్ష్మీకావ్య ఆవే దన వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోయాయని, ఒకరి పేరు మీద ఉన్న భూమిని వారికి తెలియకుండానే మరొకరి పేరు మీదకు మార్చేస్తున్నారని.. ఇలాంటి అక్రమాలను అరికట్టాలని శాఖమూరి నారాయణరావు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన సర్వేసు తన భూమి ఆక్రమణకు గురైందని దానిని విడిపించాలని కోరారు.
ఎస్సీ కార్పొరేషన్ షాపు కేటాయించాలి
మాచర్లలో తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఎస్సీ కార్పొరేషన్ షాపు గత టీడీపీ ప్రభుత్వం తనకు కేటాయించిందని, టీడీపీ ఏజెంటుగా 2019 ఎన్నికల్లో కూర్చోవడంతో ఎస్సీ కార్పొరేషన్ షాపు ఇవ్వలేదని… దయ ఉంచి తనకు షాపు కేటాయించాలని పల్నాడు జిల్లా రెంటచింతల మండలానికి చెందిన డేగల సైదరాజు వేడుకున్నాడు.
తాను టీడీపీ పార్టీకి చెందిన వాడు కావడంతో తనకు రావాల్సిన బిల్లులను గత ప్రభుత్వంలో ఆపేశారని శాఖమూరి ప్రసాద్‌బాబు వాపోయాడు. దేవాలయాల్లో తాను చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు ఇప్పించాలని అభ్యర్థించాడు.
ఐదునెలలుగా జీతాలు లేవు.. ఏఎన్‌ఎంల గోడు
చిలకలూరిపేట గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న తనకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని లక్కా ఉషారాణి వాపోయారు. ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. వెంటనే తమ జీతాలు ఇప్పించాలని ఆమెతో పాటు మరి కొంతమంది ఏఎన్‌ఎంలు కోరారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మీసేవా కేంద్రాలను నిర్వహించే 50 వేల కుంటుబాలు రోడ్డున పడ్డాయని, కూటమి ప్రభుత్వమే మీ సేవా నిర్వాహకులను ఆదుకోవాలని రాష్ట్ర మీ సేవా నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.
విజయవాడకు చెందిన మహిళ దివ్యాంగుడైన తన బిడ్డకు వినికిడి పరికరాలను అందించాలని కోరింది. విజయవాడకే చెంది మరో వృద్ధురాలు పింఛన్ కల్పించాలని వేడుకుంది. అలాగే నూజివీడుకు చెందిన మహిళ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం కావాలని వేడుకుంది.