- కుట్ర వెనుక జగన్‌రెడ్డి, సజ్జల, నందిగం సురేష్, తలశిల
- ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని వైసీపీ నేతల కుట్ర
- పాత్రధారులతో పాటు సూత్రధారులను అరెస్టు చేయాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్
మంగళగిరి(చైతన్యరథం): జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో కుట్ర పన్ని ప్రజల ధన, మాన, ప్రాణాలు తీసి చట్టబద్ధంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశిల రఘురాం ప్లాన్ ఉందన్న వర్ల పాత్రధారులతో పాటు సూత్ర ధారులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యా లయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదకు ముందు రోజు ఉద్దండరాయునిపాలెంలో ఉన్న పడవలను కావాలనే ప్రకాశం బ్యారేజీ వైపునకు తెచ్చి బ్యారేజీని ఢీకొనే విధంగా నిలబెట్టారు. ఆ బోట్లు సరిగ్గా ఢీకొని ఉంటే దివిసీమ ఉప్పెన కంటే ప్రమాదం ఘోరంగా ఉండేది. వందల ఊర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయేవి. దాదాపు 20 లక్ష ఎకరాల సాగును నాశనం చేసేందుకు కుట్ర చేశారు. వైసీపీ నేతల అధికార దాహానికి ప్రజల ప్రాణాలను బలిచేయాలని చూశారని ధ్వజమెత్తారు. దీనిని అధికారులు సీరియస్‌గా తీసుకుని దేశ ద్రోహ నేరంతో సమానంగా భావించి ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రపై డీజీపీ ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఇంత విధ్వంసానికి కుట్ర చేసిన వారిని విడిచిపెట్టకూడదని కోరారు.
ఐదేళ్ల అరాచక పాలనలో ఎన్నో ఘటనలు
జగన్ గత ఐదేళ్ల అరాచక పాలన కుట్రలు కుతంత్రాలతోనే సాగింది. ఆయన పాలన అంతా నేరపూరితమే. అధికారంలోకి రావడానికి ఎన్నో క్రిమినల్ ఆలోచనలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం బాబాయిని గొడ్డలి వేటుకు బలిచేశారు.. ఆ కేసును అడ్డుకు నేందుకు సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టించారు. కోడి కత్తి కేసులో శీను అనే దళిత యువకుడిని బలిచేశారు. ఐదేళ్లు అతడు జైల్లో మగ్గటానికి జగన్ రెడ్డే కారణం. తునిలో రైలును దహనం చేశారు. ఈ ఘటనలన్నీ జగన్ రెడ్డి, సజ్జలకు తెలియకుండా జరగలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి నానా గడ్డి తినేలా 2024 ఎన్నికల ముందు గులకరాయి డ్రామాకు తెరలేపారు. ఏదైనా చేసి అధికారం పొందాలని పన్నాగం పన్నారు. ఎప్పుడు లేని విధంగా రికార్డులను తగలబెట్టి తప్పుల నుంచి తప్పించుకోవాలని చూశారు. రాజకీయ లబ్ధి కోసం పింఛన్లు ఇవ్వకుండా ఎండల్లో తిప్పి 33 మంది అవ్వాతాతల చావుకు కారణమయ్యారు. ఈ క్రిమినల్ ఆలోచనలతోనే నేడు ప్రకాశం బ్యారేజీకి ఎసరు పెట్టాలని చూశారని ధ్వజమెత్తారు.
కుట్ర వెనుక ఎవరున్నా వదిలేది లేదు
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలకు వైసీపీ రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించడానికి వెనుకాడని వ్యక్తి బ్యారేజీపై కుట్ర చేయలేదంటే ఎవరు నమ్ముతారు? నేడు వరద బాధితులకు చంద్రబాబు ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకున్నారు. బురదలో తిరిగి ఆయన బాధితులకు భరోసా కల్పించారు. జగన్ అధికారంలో ఉంటే అల్లాడేవాళ్లమని బాధితులే అంటున్నారు. ముద్రగడ పద్మనాభం ను కులం మార్చుకునేలా చేసిన ఘనత జగన్‌రెడ్డిదే. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర పన్నిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కటకటాల్లో ఉంటే జగన్ వెళ్లి ఆయనను పరామర్శించాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయనను పరామర్శిం చడంపై జగన్ మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఎసరు పెట్టిన వ్యక్తులు మున్ముందు ఏదైనా చేయవచ్చు. అధికారులు, ప్రజలు వారి కుట్ర పూరితమైన ఆలోచనలపై అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా ఇది కుట్ర అని స్పష్టమైంది. ఇసుక పడవలు ఢీకొన్న దాని వెనుక ఎవరు ఉన్నా శిక్షిస్తామని స్పష్టం చేశారు.