తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించిన సాక్షి దినపత్రికపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 13న నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ దళితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దళితులకు వైసీపీ చేసిందేమిలేదు అన్నటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దళితులు చేసిందేమిలేదు అన్నట్లుగా కథనాన్ని ప్రచురించారు. దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆ పత్రికపై నాయకులు పలమనేరు ఎస్‌ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు.
దళితులలో అసహనాన్ని రేకెత్తించి వారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే ఆ పత్రిక వక్రికరణకు పాల్పడిరదని, తప్పుడు కథనాలు వక్రీకరణ భాషే ఆ పేపర్ నైజం అని నాయకులు విమర్శించారు. లోకేష్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప దళితులకు వైసిపి ప్రభుత్వం చేసిందేమీ లేదని, దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు తప్ప వారి అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని వారు నిలదీశారు. వక్రీకరించి రాసిన సాక్షి దినపత్రిక పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గ్యాస్ నాగరాజు, నాయకులు గిరిబాబు, ఖాజా, చిన్ని, శ్రీధర్, రవి, సుధాకర్, శ్రీనివాసులు, లోకేష్, సాధిక్ తదితరులు ఉన్నారు.