రూ.2 వేల నోట్ల రద్దు నిర్ణయం పట్ల సానుకూలత
రూ. 500 నోట్లనూ రద్దు చేయాలని విజ్ఞప్తి
ప్రాంతీయ పార్టీగా వున్నా జాతీయ భావాలతోనే నిర్ణయాలు
దేశ రాజకీయాల్లో ప్రజా శ్రేయస్సు కొరకు తీసుకునే మంచి నిర్ణయాలను స్వాగతించడంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగానే కేంద్రం తాజాగా రూ.2000 నోటు రద్దు
చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తోంది. ఇదే సందర్భంలో రూ.500 నోటు కూడా రద్దు చేయాలని సూచిస్తోంది. డిజిటల్ లావాదేవీల్లో భారతదేశం నేడు ప్రపంచంలో మొదటి
స్థానానికి చేరుకుని, ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి దోహద పడుతోంది.
తెలుగు దేశం లక్ష్యం కూడా పేదల ఆదాయం పెంచి వారిని ధనికులుగా చేయాలనే. పారదర్శకత పెరిగి, జవాబుదారీతనం పెరగడానికి డిజిటల్ లావాదేవీల వంటి నిర్ణయాలు దోహద పడతాయి. పారదర్శక పాలన, ఆదర్శ రాజకీయాలు అనేది తెలుగుదేశం ఎప్పుడూ ఆచరించే విధానం అని తెలుగుదేశం పార్టీ రాజకీయ తీర్మానం చేసింది. రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు లో భాగంగా శనివారం జరిగిన ప్రతినిధుల సభలో పలు తీర్మానాలు ఆమోదించారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఈమేరకు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రాజకీయ అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన అవినీతి నేతలు.
ఆ డబ్బుతోనే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. రాజకీయం అంటే ప్రజాసేవ కాదు. సంపాదనే అనే విధానం పెరిగిపోయింది. అవినీతి పరుల చేతుల్లోకి రాజకీయాలు పూర్తిగా వెళ్లిపోతే ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారుతారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నా, జాతీయ భావాలున్న తెలుగుదేశం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే. అందులో భాగంగానే తెలుగుదేశం నేడు పెద్ద నోట్ల రద్దు చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. తద్వారా డబ్బుతో ఎన్నికల్లో గెలవాలి అనుకునే వారికి కొంతైనా కట్టడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగుజాతి చరిత్రలో ఒక నూతన అధ్యాయంఅత్యల్ప సమయంలో అత్యధిక ప్రజా మద్దతును పొందడం అద్వితీయం. సరిగ్గా 40 సంవత్సరాల ముందు దేశంలో మరియు రాష్ట్రంలో నెలకొన్న విచిత్రమైన పరిస్థితులను నిశితంగా గమనించి, కలవరపడి, మదనపడి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారు.
భారతదేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలను ఛేదించుకుని స్వతంత్రం సముపార్జించినా బానిసత్వపు పోకడలను విడనాడకపోవడం, స్వార్థ రాజకీయాలు, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల విముఖత, ప్రజా వ్యతిరేక విధానాలు వంటి అస్తవ్యస్త పరిపాలన, పైగా ముఖ్యంగా, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడం, నందమూరి తారక రామారావుని ఎంతగానో బాధించాయి.‘సంఘం శరణం గచ్ఛామి’ అన్న బుద్ధుని వాక్కుని స్ఫూర్తిగా గ్రహించి “సమాజమే దేవాలయం ` ప్రజలే దేవుళ్ళు” అనే సత్యాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగు ఆత్మగౌరవమే ఊపిరిగా, నేను మానవతా వాదిని, ఒక తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకుంటూ, ఒక ప్రజా ఉద్యమానికి నాంది పలికారు నందమూరి తారక రామారావు.
తెలుగుదేశం పార్టీని అకుంఠిత దీక్షతో, ఒక మహోద్యమంగా ముందుకు నడిపించి విజయం సాధించారు నందమూరి తారక రామారావు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర దిశను దశను మార్చివేసిన అపురూపశిల్పి మరియ నవయుగ వైతాళికుడు నందమూరి తారక రామారావు ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ తీసుకొచ్చిన అనేక మౌలిక మార్పులు, నూతన శాసనాలు దేశంలోనే తలమానికంగా, ఒక దిక్సూచిగా పరిఢవిల్లడం ఆయన చిత్తశుద్ధికి, దృఢ సంకల్పానికి తార్కాణం. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు మరియు మహిళా విద్యాలయాల స్థాపన, రెండు రూపాయలకే కిలోబియ్యం, సంగం ధరకే చేనేత వస్త్రాలు, రైతులకు విద్యుత్ రాయితీ, పేదలకు శాశ్వత గృహాలు, మండల వ్యవస్థ, తిరుమలలో నిత్యాన్నదానం వంటి ఎన్నో సంస్కరణలకు, మహత్కార్యాలకు నిలువెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు.
రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ గణనీయమైన గుర్తింపు తెచ్చుకోవడానికి నందమూరి తారక రామారావు కృషి అనన్య సామాన్యం. ఎన్టీఆర్ నాయకత్వంలో 1984 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటికే జాతీయస్థాయిలో బలంగా వీస్తున్న రాజకీయ పవనాలను అధిగమించి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లను సాధించి దేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించింది. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీగా దేశాభివృద్ధిలో తగు పాత్ర పోషించింది. 1988లో ఏర్పడిన కాంగ్రెసేతర జాతీయ స్థాయి పార్టీల సమాఖ్య నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఎన్టీఆర్ ఎంపికవ్వడం జాతీయ స్థాయిలో ఆయనకు లభించిన ఖ్యాతికి నిదర్శనం. 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించడంలో మరియు వి.పి.సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేయడంలోనూ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర వహించారు.
ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ చూపించిన మార్గంలో పయనిస్తూ విలువలతో కూడిన సుపరిపాలన అందిస్తూ ముఖ్యమంత్రిగా అనేక
స్కంరణలు విజయవంతంగా ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 1996లో జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడంలోను ఆ తర్వాత ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలోను చంద్రబాబు ప్రముఖ పాత్రను పోషించారు.
శ్రీ నారా చంద్రబాబునాయుడు 1999లో ఎన్డీయేకు జాతీయ కన్వీనర్‌గా పనిచేసి, 29 ఎంపీ సీట్లతో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించి వాజ్‌పేయి జాతీయ సంకీర్ణ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు. తరువాత కాలంలో కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాంలను రాష్ట్రపతులుగా చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు చంద్రబాబు. స్వర్ణ చతుర్భుజి హైవేకు మొదట నెల్లూరు`చెన్నై ఏర్పాటు, టెలికాం సంస్కరణలకు ప్రధాని వాజ్‌పేయ్‌ని ప్రభావితం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం సంస్కరణలతో, సుపరిపాలన పారదర్శకతలతో కూడిన ప్రజాభ్యుదయ విధానాలలో దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.
అంతర్జాతీయ ఐటీ రంగ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చి ఐటీ విప్లవానికి నాంది పలికింది చంద్రబాబునాయుడు. దేశంలో మొట్టమొదటిసారిగా సంస్కరణలను చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేశారు. బయోటెక్నాలజీ, వాతావరణ సమతుల్యత కాపాడే సమర్థ నీటి వినియోగ మరియు నూతన వ్యవసాయ రంగ విధానాలు ప్రవేశపెట్టిన దార్శనికుడు చంద్రబాబు.రవాణా, మౌలిక వసతులు కల్పనలో దేశానికి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబు. ముఖ్యంగా విద్యుత్ మరియు టెలికాం రంగ సంస్కరణలను జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టి, ప్రబోధించిన ఘనత చంద్రబాబుదే. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్‌షిప్ అంటే ఫార్ములా పి4 అనే నూతన విధానాన్ని ఆవిష్కరించి దానితో సంపద సృష్టించి, ఉద్యోగిత కల్పించి, పేదల్ని ధనికులుగా అభివృద్ధిపరచాలనే పట్టుదలతో శ్రమిస్తున్న నిత్య కృషీవలుడు నారా చంద్రబాబునాయుడు.
వైసీపీ హయాంలో పేదల సంక్షేమాన్ని వదిలేసి కక్షసాధింపు రాజకీయాలే అజెండాగా పనిచేస్తోంది. సంక్షేమానికి నాంది పలికింది ఎన్టీఆర్. దాన్ని మరింత అభివృద్ధిపరచి సాధికార సంక్షేమాన్ని ఇచ్చారు చంద్రబాబునాయుడు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం సమతుల్యత సాధించడమైంది. భవిష్యత్తులో మరింత బాధ్యత వహించి పేదరికం లేని సమాజాన్ని మరియు సమాజంలో అసమానతలను తొలగించడమే మా కర్తవ్యం.