మచిలీపట్నం(చైతన్యరథం): పేదల ఆకలి తీర్చేవారే అసలైన నాయకులు అనిపించుకుంటారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని అన్న క్యాంటీన్‌ను ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పలువురికి అల్పాహారం వడ్డించారు. పేదల అభ్యున్నతి, ఆకలి తీర్చేవిషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు వచ్చే వారికి అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరం అన్నారు.
కేవలం రూ.5తో కడుపు నిండా అన్నం పెట్టే వ్యవస్థను గత పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా నిర్వీర్యం చేశారన్నారు. అలాంటి వ్యవస్థలో అవినీతి అని ఆరోపణలు చేయడం తప్ప ఐదేళ్లో రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయారు. పేదలకు నోటి దగ్గర తిండిని దూరం చేశారు. నిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో అడుగులు వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. శాశ్వతంగా ఉండేలా తీర్చిదిద్దడనికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకే దాతల నుండి విరాళాల స్వీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏది ఏమైనా పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం, ఉపాధి అవకాశాలు కల్పించి మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడమే తమ ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని రవీంద్ర తెలిపారు.
గౌతు లచ్చన్నకు మంత్రి నివాళి
సాహసానికి, కార్యదక్షతకు, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం సర్దార్ గౌతు లచ్చన్న అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణతో కలిసి మచిలీపట్సంలో లచ్చన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ దేశంలో పటేల్ తర్వాత సర్దార్ బిరుదుపొందిన ఏకైక నాయకుడిగా లచ్చన్న గుర్తింపు పొందారన్నారు.