- పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ సందర్శన
- ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతుల పరిశీలన
- విద్యారంగ అభివృద్ధిపై మంత్రి లోకేష్‌కు ధర్మేంద్ర ప్రధాన్ అభినందన
భోగాపురం (చైతన్య రథం): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.పార్వతి, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతుల పరిశీలన
పాఠశాల మొత్తం కలియతిరిగిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వసతులను పరిశీలించారు. ముందుగా జాదు పిఠారా కిట్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. జాదు పిఠారా కిట్ గురించి సిబ్బంది, మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్‌మెంట్ బుక్‌లెట్‌ను కేంద్ర మంత్రికి లోకేష్ చూపించారు. విలువల విద్య కోసం ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో రూపొందించిన పుస్తకాల గురించి మంత్రి లోకేష్ విశదీకరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్‌ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరిశీలించారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫాం, స్కూల్ బ్యాగ్, షూ, బెల్ట్, సాక్స్‌లను పరిశీలించారు. పిక్టోరియల్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ గురించి సిబ్బంది వివరించారు.
పాఠశాల విద్యాశాఖ డ్యాష్‌బోర్డును పరిశీలించిన కేంద్ర మంత్రి
ఈ సందర్భంగా విద్యాశాఖ రూపొందించిన డ్యాష్‌బోర్డును కేంద్ర మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. లీప్ డ్యాష్‌బోర్డు గురించి మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. డ్యాష్‌బోర్డ్‌లో ఎన్‌రోల్‌మెంట్, లెర్నింగ్ అవుట్‌కమ్స్, అటెండెన్స్, మధ్యాహ్న భోజన పథకం, ఎంఈవో, డీఈవోల ఇన్‌స్పెక్షన్, డ్రాపఅవుట్స్, లీప్ యాప్ డౌన్‌లోడ్స్, స్మార్ట్ కిచెన్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత సెంటర్స్, అకడమిక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పర్ఫార్మెన్స్ వంటి అంశాల గురించి విశదీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న స్మార్ట్ కిచెన్ల వ్యవస్థపై రూపొందించిన ఏవీని వీక్షించారు. కడపలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన స్మార్ట్ కిచెన్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం స్పోర్ట్స్ రూమ్, స్కిల్ ల్యాబ్‌ను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పైథాన్ లాంగ్వేజ్‌ను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోం వర్క్ అండ్ పీరియాడికల్ అసెస్‌మెంట్ అప్లికేషన్‌ను ఆసక్తిగా గమనించారు. ప్రీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించి సిబ్బంది వివరించారు. ఇందుకు సంబంధించిన కౌశల్ బోధ్ పుస్తకాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. స్కూల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. లైబ్రరీలోని పుస్తకాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు.
చాణక్య అంటే ఎవరో తెలుసా?
అనంతరం మంత్రులు పాఠశాలలోని 9వ తరగతి బీ సెక్షన్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కూర్చొని ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అంశంపై రూపొందించిన క్లిక్కర్ వీడియోను వీక్షించారు. సదరు పాఠ్యాంశం గురించి ఉపాధ్యాయురాలు విద్యార్థులకు వివరించారు. క్లిక్కర్ వీడియోకు సంబంధించి ఫ్లిప్ ప్యానల్ ద్వారా క్విజ్ నిర్వహించగా 55 శాతం మంది విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా తరగతి గదిలోని విద్యార్థులతో కేంద్ర మంత్రి సంభాషించారు. ఈ రోజు ఏం టిఫిన్ తిన్నావని ఓ విద్యార్థిని ప్రశ్నించగా దోశ తిన్నానని సమాధానం ఇచ్చాడు. మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు. అనంతరం ఓ విద్యార్థి పేరు అడగ్గా చాణక్య అని చెప్పాడు. “చాణక్య అంటే ఎవరో తెలుసా? కింగఆ, కింగ్‌మేకరా?” అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కింగ్‌మేకర్ అని విద్యార్థి సమాధానం చెప్పాడు. మరో విద్యార్థి రాం ప్రసాద్‌ను పాఠ్యాంశాలపై అనుమానాలు ఉంటే ఎవరిని అడుగుతావని ప్రశ్నించగా.. తన సోదరుడిని అడుగుతానని విద్యార్థి సమాధానం చెప్పాడు. ఏ భాష సౌకర్యంగా భావిస్తావని సదరు విద్యార్థిని ప్రశ్నించగా తెలుగు అని సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ గురించి మంత్రి లోకేష్ వివరించారు.
అనంతరం విద్యార్థి స్థాయి ఆధారంగా నేర్చుకునే పాల్(PAL) ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ పేర్లతో రూపొందించిన త్రీడి ప్రింటింగ్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఓ విద్యార్థి బహుమతిగా అందజేశాడు.
ఏపీలో విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్న మంత్రి నారా లోకేష్‌ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎసఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, డీఈవో మాణిక్యం, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.















