స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఆరు కొత్త పాలసీలను రూపొందించి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు ఆరు కీలక రంగాలకు ఒకేసారి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు కొత్త పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శంగా నిలవనున్నాయి. వివిధ రంగాల్లో తీసుకొచ్చిన ఆరు అద్భుత పాలసీలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తెచ్చిన నూతన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం కానుంది. రాష్ట్రాభివృద్ధికి ఇదొక శుభపరిణామమని చెప్పాలి. ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీలు పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చేలా, విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా, ఆదర్శంగా ఉన్నాయి. అపారమైన పట్టుదలతో ప్రపంచ నలుమూలలనుంచి పెట్టుబడులు సాధించి సంపద సృష్టించే దిశలో వున్నారు సీయం చంద్రబాబు. పెట్టుబడులు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక విధానాలు రూపొందించారు. ప్రధానంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ పద్ధతిలో తీసుకురానున్న ప్రైవేటు పారిశ్రామిక పార్కులు రాష్ట్రంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తాయి అనడంలో సందేహం లేదు.
పార్కుల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం పారిశ్రామికవేత్తలకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రానున్న ఐదేళ్లలో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఒక సంకల్పంతో తీసుకొచ్చిన కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతికి సూచికలు కాగలవు. ఈ పాలసీలు రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు విరజిమ్మనున్నాయి. పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలవాలని నిర్ణయించింది ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆవిష్కరణలకు దోహదపడేలా నూతన పాలసీలను రూపొందించారు. ఈ నూతన పాలసీలతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడిదారులు బారులు తీరే అవకాశముంది. నూతన పారిశ్రామిక పాలసీలు అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్ ఫస్ట్ నినాదంతో కీలక పాలసీలను రూపొందించారు. ప్రస్తుత ఎనర్జీ పాలసీలో పెట్టుబడిదారులకు అనేక సానుకూల అంశాలు. సోలార్ ఎనర్జీకి 25శాతం, గ్రీన్ హైడ్రోజన్‌కు 30శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయం. అలాగే పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా మహిళలకు ప్రకటించిన ఇన్సెంటివ్‌లు గతంలో ఎవరూ ప్రకటించలేదు కూడా.
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది ప్రభుత్వం. పారిశ్రామికరంగానికి చెందిన అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరిపి అద్భుత పారిశ్రామిక పాలసీలూ సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. వ్యాపార కార్యకలాపాలకు అనువుగా దేశంలోనే ది బెస్ట్ బిజినెస్ ఎకో సిస్టంను అభివృద్ధి చేయనుండటంతో పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామంగా నిలవనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి తరుణం ఎప్పుడూ రాదు. పెట్టుబడులతో, పెట్టుబడిదారుల వ్యాపారంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందనుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆరు పాలసీలు గేమ్ చేంజర్లుగా నిలవనున్నాయి. పారిశ్రామికవేత్తలకు మళ్లీ నమ్మకం కుదిరేందుకుగాను అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చెయ్యనున్నారు. జాబ్ ఫస్ట్ అనే నినాదంతో పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయ్యడం యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రభుత్వ పట్టుదలకు, చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. పెట్టుబడుల ఆకర్షణ.. ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎలక్ట్రానిక్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవల్‌పమెంట్, ఎంఎస్ఎంఇ పాలసీ, ప్లగ్ అండ్ ప్లే ఇండిస్ట్రియల్ పాలసీలను రూపొందించారు..
ఉద్యోగాల కల్పన ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పారిశ్రామికవాడల్లోనూ.. పరిశ్రమల ఏర్పాటులోనూ సామాజిక సమతుల్యతను పాటిస్తూ.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను భాగస్వాములను చేయనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసి, రాష్ట్రమంతా గ్రీన్ ఎనర్జీ హబ్‌గా, నౌకాశ్రయాలను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా మార్చనున్నారు. వన్ ఫ్యామిలీ -వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలు చేయడమే కాదు, ఉద్యోగాలు కల్పించే స్థాయికి మన యువత ఎదగాలని, యువత భవిష్యత్తు బంగారం చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి తద్వారా పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే ఏపీని ప్రపంచానికే ఆక్వాకల్చర్ హబ్‌గా, రాయలసీమ ఫ్రూట్ బాస్కెట్ హబ్‌గా మార్చాలని, పెట్టుబడిలేని సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు బ్రాండిరగ్ చేయించి, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణకోస్తా, రాయలసీమల్లో ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు సృష్టించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థింక్ గ్లోబల్లీ- యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో యువతకు అవకాశం కల్పించనున్నారు.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ క్రమంగా గమ్యస్థానంగా మారుతోందని చెప్పడానికి ఇప్పటికే లులూ, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్వంటి సంస్థలు ముందుకు రావడం, ఇప్పుడు టీసీఎస్ కూడా విశాఖలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధం కావడంతో విశాఖ ఐటీ హబ్‌గా మారనున్నదని చెప్పవచ్చు. దీంతో ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. అంతేకాదు అమరావతి కేంద్రంగా రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో జోనల్ ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా మార్చాలని, స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పోర్టులు టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టి ఉపాధి కల్పనతోపాటు రాష్ట్రం అభివృద్ధి, సంపద పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక సంకల్పంతో చంద్రబాబు పారిశ్రామికాంధ్ర ఆవిష్కరణకు కృషి చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నవ్యాంధ్రను జాతీయస్థాయిలో అగ్రభాగాన నిలిపిన చంద్రబాబు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రభాగాన నిలపాలని నిర్ణయించారు. సుదీర్ఘ తీరప్రాంతం, అపార ఖనిజ సంపద, నౌకాశ్రయాలు, సరసమైన ధరలకు సరిపడా భూమి, మానవ వనరులు, నీరు, విద్యుత్తు, పెట్టుబడి రాయితీలు, మనం కల్పించే సౌలభ్యాలు, ప్రోత్సాహకాలు, నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత, క్యారెక్టర్ భారీగా పెట్టుబడులకు వరంకానున్నాయి. ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన నూతన పారిశ్రామిక పాలసీలు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు సీఎం చంద్రబాబు. విభజన సమయంలోనూ రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేవు. కానీ చంద్రబాబు కృషితోనే అనేక భారీ పరిశ్రమలు బారులుతీరాయి. అన్నీ కోల్పోయిన రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి లక్షలమందికి ఉపాధి కల్పించడం చంద్రబాబుకే సాధ్యమైంది ఆనాడు. ఇప్పుడు కూడా పెట్టుబడులు సాధించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వెయ్యబోతున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన అడుగులు వెయ్యడం అభినందనీయం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన సానుకూల పెట్టుబడి వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిన పరిస్థితుల్లో.. తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పునాదులను పటిష్టపర్చి పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ఆర్థికాభివృద్ధిని పెంచడం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.
నీరుకొండ ప్రసాద్