- వైసీపీకి ఊడిగం చేసినందుకు ప్రతి సహకారమా?
- ఆనాటి పన్నాగాలు బయటపడతాయని భయమా?
- రోత రాతలతో సర్కారుపై బురదజల్లే ప్రయత్నాలేంటి?
- నైతిక పతనంలో రికార్డులు సాధించింది జగన్ పార్టీయే
- కపటి కథనాలతో వాస్తవాలను మభ్యపెట్టలేరు..!
అమరావతి (చైతన్య రథం): పాలనా యంత్రాంగానికి ఇరుసులు `అఖిలభారత సర్వీసు అధికారులు. ప్రజాసేవే పరమావధి అన్న అకుంఠిత లక్ష్యాలతో ఎన్నో కఠినపరీక్షలు అధిగమించి అత్యున్నత సర్వీసుకు పంపికైనవారి ప్రతిష్ట `సమాజంలో ప్రత్యేకం. అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ద బాధ్యతలలో ఉన్న అధికారులు.. దారితప్పి నీతిమాలిన రాజకీయుల ముందు సాగిలబడితే.. కఠినంగా శిక్షించక తప్పదు. జగన్ జమానాలో ఇందుకు భిన్నమైన దృశ్యాలే చూడాల్సి వచ్చింది. నేరమయ రాజకీయాలతో ప్రజాస్వామ్యం మనుగడను ప్రమాదంలో పడేసే తీరులో సాగిన పాలనకు.. అత్యున్నత సర్వీసు అధికారులే పూర్తిగా సహకరించారు. అవినీతిపరులైన అధికారులు, నాయకుల బారినుంచి రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ఎవరొచ్చినా కాపాడలేరన్న భావన కలిగించారు. చట్టంముందు అందరూ సమానమేనని చెప్పుకోవడం తప్ప `ఆచరణలో ఎక్కడా కనిపించలేదు జగన్ ఏలుబడిలో.
కొత్త ప్రభుత్వ పాలనలో `కళంకితులను క్రమశిక్షణలో పెట్టే చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం.. అదేదో మహాపరాధమన్నట్టు నెత్తీనోరూ కొట్టుకుంటూ భ్రష్ట రాజకీయాన్ని ప్రదర్శిస్తోంది వైసీపీ. నిజానికి `జగన్ పాలనలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు పాలకపక్షం అడుగులకు మడుగులొత్తారు. విధానపరమైన అంశాలలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను న్యాయస్థానాలే తప్పుబట్టినా.. జగన్ సర్కారు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి మెప్పుకోసం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చౌకబారుగా వ్యవహరించి తమస్థాయిని తగ్గించుకున్న ఉదంతాలు కోకొల్లలు. ప్రజాసేవలో ఉండాల్సిన అధికారులు పాలకుల సేవలో తరించడంతో `అఖిల భారతస్థాయి అధికారుల ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. దుష్ట పాలకుడు జగన్‌ను మెప్పించేందుకు కొందరు అధికారులు హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి జైలు అనుభవించిన ఘట్టాలూ లేకపోలేదు.
కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని ఐఏఎస్, ఐపీఎస్‌లపై జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు మర్చపోలేరు. అధికార పార్టీ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి తప్పులపై తప్పులు చేసి న్యాయస్థానాల్లో అఖిల భారత సర్వీసు అధికారులు చీవాట్లుతిన్న కాలం `జగన్ జమానాలోనే! కీలక వ్యవస్థలోని కళంకితులను గాడినపెట్టే చర్యలకు ఉపక్రమించిన కూటమి సర్కారు మహాపరాధమేదో చేసినట్టు నీలిమీడియా కథనాలు అల్లడం `ఆనాడు ఆయా అధికారులను బానిసలుగా వాడుకున్న కృతజ్ఞతే.
జ్యుడీషియల్ కస్టడీలోవున్న లోక్‌సభ ఎంపీ రఘురామకృష్ణంరాజును టార్చర్‌చేసి చట్టాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఐపీఎస్‌లను వీఆర్‌లో పెట్టడం నేరమైనట్టు జగన్ విషపత్రిక సాక్షి కథనాలు అల్లడం సిగ్గుచేటు. కళంకితులను క్రమశిక్షణలో పెట్టకుండా.. నెత్తిన పెట్టుకుంటారా? గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ఐపీఎస్‌లను ఏంచేయాలి? నిజానికి ఇంతటి భయంకర నేరారోపణలున్న అధికారులను సస్పెండ్ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. సంహారంకంటే సంస్కరించడానికే పక్కువ ప్రాధాన్యతనిచ్చే చంద్రబాబు ప్రభుత్వం `కళంకిత అధికారులను కేవలం విఆర్‌లో మాత్రమే పెట్టింది. మరోసారి తప్పులు చేయకుండా మారడానికి అవకాశమిస్తోంది.
జగన్ జమానాలో దీనికి విరుద్ధం!
ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును అబద్ధపు అభియోగాలతో జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉన్నత న్యాయస్థానాల తీర్పును నీరుగార్చి ఆయనను ఐదేళ్లు సస్పెన్షన్‌లోనే ఉంచారు. జగన్ పాలనలో 15మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను, 170మందికి పైగా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలను నెలలు, ఏళ్ల తరబడి విఆర్‌లో ఉంచారు. 15వ ర్యాంకులో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్టు కట్టబెట్టి మూడవస్థానంలో ఉన్న ద్వారకాతిరుమలరావుకు వైసీపీ సర్కారు తీరని అన్యాయం చేసింది. సీనియర్ ఐఏఎస్ ఎల్‌వి సుబ్రహ్మణ్యంని అవమానకరంగా సీఎస్ పదవి నుంచి తప్పించింది. కూటమి సర్కారు పాలనలో సివిల్ సర్వెంట్ల వ్యవస్థకే అన్యాయం జరిగిపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న స్వర్ణజిత్‌సేన్, ప్రవీణకుమార్‌లకు `జగన్ జమానాలో సాగిన అసలు దుర్మార్గాలు కనిపించలేదా? అన్నదే ప్రజల ప్రశ్న. ఆనాడు ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ సర్కారు అనుచిత తీరును ఖండిరచివుంటే `సివిల్ సర్వెంట్ల గురించి వకాల్తా తీసుకునే నైతిక హక్కు ఉండిఉండేది. ఆ పని చేయలేదు కాబట్టి.. వారిని జగన్ వత్తాసుదారులుగానే భావించాలి.
జగన్ జమానాలో `ప్రతిభ కలిగిన సీనియర్ అధికారులని పక్కనపెట్టి సర్కారుకు అనుకూలురైన కళంకితులకు సీనియార్టీతో సంబంధం లేకుండా ప్రాధాన్యత కలిగిన పోస్టింగులూ ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆ కోవకే వస్తారు. అర్హత లేకపోయినా ఆయాచితంగా లభించిన సీఎస్ పదవి జవహర్‌కు కోతికి కొబ్బరికాయ దొరికినట్టయ్యింది. తన వీరవిధేయతను, స్వామిభక్తిని చాటుకునేందుకు సీనియర్ ఐఏఎస్ హోదాను దిగజార్చారు. దొంగ ఓట్ల నమోదు దగ్గర నుంచి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకునే వరకు నిస్సిగ్గుగా, ఏకపక్షంగా వ్యవహరించారు. వీరితోపాటు డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డికీ అర్హతకు మించిన అవకాశమే లభించింది. సమర్థులైన, ప్రతిభ కలిగిన సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించడం `జగన్ జమానాలో జరిగిన పెద్ద తప్పుల్లో అదొకటి. అలాంటి అధికారుల ప్రవర్తనలో పరివర్తన తెచ్చేందుకు కూటమి సర్కారు కృషి చేస్తుంటే.. రోత రాతలతో దిగజారుడు రాజకీయం ప్రదర్శించడం వైసీపీకే చెల్లు.
జగన్ దురాగతాలకు బలైన ఉన్నతాధికారులు..
విధి నిర్వహణలో అత్యంత నిబద్ధత కలిగిన సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను 2023 నుంచి.. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకూ పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టి వైసీపీ సర్కారు అరాచకాన్ని ప్రదర్శించింది. సర్వీసులో నిజాయితీ కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ శ్రీనరేష్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడిరదీ వైసీపీనే. 2019లో జగన్ సర్కారు గద్దెనెక్కిన వెంటనే.. యూపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ రాజమౌళిని 14 నెలలపాటు వీఆర్‌లో పెట్టి.. తరువాత పోస్టింగ్ ఇచ్చిన వారానికి యూపీకి సాంగనంపిన చరిత్ర వైసీపీది కాదా? వైసీపీలో నెంబర్ 2 స్థానంలోవున్న విజయసాయి రెడ్డిని హైదరాబాద్‌లో కలిసే వరకు సీనియర్ ఐఏఎస్ సతీష్ చందర్‌కు పోస్టింగ్ కుడా ఇవ్వని అమానుషం వైసీపీది కాదా? కాంట్రెక్టర్‌కు మధ్యవర్తిత్వం చేస్తేగానీ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్‌కు పోస్టింగ్ ఇవ్వని వైసీపీ సర్కారు చర్య దారుణం కాదా? సిన్సియర్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్‌లు బాలసుబ్రమణ్యం, ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారిని పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం
‘ఆటవికం’ కాదా?
శ్రీనివాసరాజు, చెరుకూరి శ్రీధర్, సి. నాగరాణి, క్రిష్ణకిశోర్, ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్‌వి రాజశేఖర్ బాబు, కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, లక్ష్మీ నారాయణ, గంటా సుబ్బారావులాంటి ఉన్నతస్థాయి అధికారులను రాచి రంపాన పెట్టింది వైసీపీ సర్కారే. ఇలా అనేకమంది నిబద్ధత కలిగిన ఉన్నతాధికారులను జగన్ ప్రభుత్వం వేధించి, హింసించినప్పుడు నీలి మీడియా ఎందుకు కళ్లు మూసుకుంది? పైగా ప్రభుత్వ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా బలపరచలేదా? నేడు కళంకిత అధికారులను కేవలం వీఆర్‌లో పెడితే జగన్ ముఠా, నీలిమీడియా ఎందుకు భుజాలు తడుముకుంటోంది? జగన్‌రెడ్డి నేరాలు, దోపిడీలలో భాగస్వాములను కాపాడుకోవటానికి కాదా?