- కొత్త పాస్ పుస్తకాల జారీకి కేబినెట్ ఓకే
- 22ఏ భూముల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక చెక్
- రికార్డుల తారుమారు, ల్యాండ్‌గ్రాబింగ్ నిగ్గుతేల్చాలి
- మత్స్యకారులకు బాసటగా జీవో 114, జీవో 217 రద్దు
- అక్టోబర్ 1నుంచి అమల్లోకి కొత్త మద్యం విధానం
- మెడికల్ కాలేజీల్లో పోస్టుల పెంపునకు గ్రీన్ సిగ్నల్
- సున్నిపెంటకు కేటాయించిన 280 ఎకరాలు వెనక్కి
- ‘ఇద్దరు పిల్లల’ అనర్హతవేటు నిబంధనలు సవరణ
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు
అమరావతి (చైతన్య రథం): 22ఏ సెక్షన్ కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం మూడు నెలలపాటు నిలిపివేయనుంది. రూ.22.95 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వం జారీచేసిన 21.86 లక్షల భూహక్కు సర్వే పత్రాల స్థానంలో.. రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22ఏ సెక్షన్ కింద భూములకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో గ్రామసభలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి రిజిస్ట్రేషన్లు నిర్వహించరు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను, పాస్‌బుక్‌లను తయారు చేయాలన్నది సర్కారు నిర్ణయం.
రెవెన్యూ రికార్డుల తారుమారు, ల్యాండ్‌గ్రాబింగ్ పెద్దపత్తున జరిగిందన్న సమాచారం నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి భూబదిలీల్లో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలను గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు పన్డీయే సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఈమేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. అలాగే, రాష్ట్రంలో అక్టోబర్ 1నుంచి నూతన మద్యం విధానం అమలు చేయాలని, తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలని నిర్ణయించారు. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను ఏంచేయాలనే అంశంపైనా ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోన్న నేపథ్యంలో ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపైనా కేబినెట్‌లో చర్చించారు. మంత్రివర్గం సమావేశం అనంతరం భేటీలో చర్చించిన పలు కీలకాంశాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు.
జీవో 217, జీవో 114 రద్దు
చేప పిల్లల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు దళారీ వ్యవస్థ లేకుండా మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు కేబినెట్ అంగీకరించింది. దీనిపై పర్యాటక అభివృద్ధి కోణంలోనూ ఆలోచించాలని, అప్పుడే ఉపాధి, ఆర్థిక ప్రగతి సాధ్యమని సీఎం చంద్రబాబు కేబినెట్‌కు సూచించారు. మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా తరువాతి కేబినెట్‌కు యాక్షన్ ప్లాన్ అందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అటు పశుసంవర్థక లబ్దిదారులు, ఇటు మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న జీవో 217, జీవో 114ను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించినట్టు పార్థసారథి వెల్లడిరచారు. ఈ చర్యతో రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం.
మెడికల్ కాలేజీల్లో పోస్టుల పెంపునకు గ్రీన్ సిగ్నల్
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త వైద్య కళాశాలల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఫేజ్-2కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో మొదటి ఏడాది ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించడానికి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. గుజరాత్‌లోవున్న పీపీపీ విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల్ని ఆదేశించారని మంత్రి కొలుసు వెల్లడిరచారు.
అక్టోబరు 1నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ
2014-19తో పోలిస్తే ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ లోపభూయిష్టంగా, పారదర్శకతకు దూరంగా వుంది. పర్యవేక్షణలో అంతరాలు, నేరాలు మరియు ఆదాయ నష్టాల పెరుగుదలకు దారితీస్తోన్న నేపథ్యంలో.. లోపభూయిష్ట విధానానికి స్వస్తి పలకనున్నారు. రానున్న నెలన్నర రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం క్రిందకు తేవాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణ విధానాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రివర్గం తుది ఆమోదానికి ముందు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. సెప్టెంబర్ 5, 2024 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, 1 అక్టోబర్, 2024 నుండి కొత్త మద్యం విధానం అమలు చేయనున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల అల్పాదాయ వర్గాలకు నాణ్యమైన మద్యం అందుబాటు ధరలలో అందించే వెసులుబాటు కలుగుతుంది. రానున్న 60-65 రోజుల్లో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మద్యం సేకరణ విధానాన్ని ఆటోమేటెడ్ సిస్టం క్రింద అందుబాటులోకి తేనున్నారు. అక్రమ మద్యం నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న డీ-అడిక్షన్ మరియు రిహబిలిటేషన్ విధానాన్ని అధ్యయనం చేసి మన రాష్ట్రంలోనూ సమర్థవంతంగా ఆ కేంద్రాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదించింది. అయితే, మద్యం విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు.
జీవో 40 రద్దు.. సున్నిపెంటకు కేటాయించిన 280 ఎకరాలు వెనక్కి
జీవో నంబర్ 40 రద్దుకు జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మే 11, 2023న జారీ చేసిన జీవో 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ.. దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూమిని అన్ని చట్టాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు వినియోగించుకోవాలని కేబినెట్ సూచించినట్టు మంత్రి కొలుసు వివరించారు.
స్థానిక ఎన్నికల్లో అనర్హతవేటు నిబంధనలు రద్దు
ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు మునిసిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చట్ట సవరణల రద్దుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తగ్గుతున్న పునరుత్పత్తి రేటును పరిగణలోకి తీసుకుంటూ మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాలను, జనాభా స్థిరీకరణ, జనాభా సమతౌల్యతను దృష్టిలో ఉంచుకొని చట్టసవరణల రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కొలుసు వెల్లడిరచారు. అలాగే, ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం -1994లోని సెక్షన్ 19కు చేసిన సవరణను రద్దు చేసేందుకూ కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే ఈ చట్టాన్ని 30 ఏళ్లపాటు అమలు చేయడంతో సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యమున్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో, పిల్లలసంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్టు మంత్రి వివరించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ -1992, సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్‌డిఎఫ్)పై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో ఏడాది కొనసాగించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందన్నారు.