- కాటసాని కన్నుపడితే కబ్జా
- వాకిలైనా వల్లకాడైనా ఒకటే..
- దందాలో అతని దారే వేరు
- పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో పాపాలు
- చేతికి మట్టంటకుండా అక్రమాలు
- కోట్లు కొల్లగొట్టిన కథలు ఎన్నో..
- తండ్రి వెనుక కొడుకూ అంతే..
- పాణ్యం ఎమ్మెల్యే దోపిడీ వెయ్యి కోట్లపైనే!
- కాదేదీ కవితకనర్హం అంటాడు శ్రీశ్రీ.
- కాదేదీ కబ్జాకనర్హం అంటాడు కాటసాని.
పేరు గొప్ప రాంభూపాల్‌రెడ్డి.. చేసే పనులు మాత్రం ఊరు దిబ్బ. మట్టైనా.. మశానమైనా, వాకిలైనా వల్లకాడైనా, పేదోడి భూమైనా.. పెద్దోళ్ల బందెల దొడ్డైనా `కన్నుపడితే అతని ఖాతాలో పడాల్సిందే. కబ్జా అతని రాజ్యాంగేతర హక్కు. పోస్టింగుల్లోనూ పౌర వ్యవహారాల్లోనూ దందా `అతని అనధికార పంథా. దేవుడి భూములు దున్నేసినా ఏ దేవుడూ అడగలేడు. మైనార్టీల వక్ఫ్ భూములు బుక్కేసినా.. ఏ అల్లా అడ్డుకోలేడు. విచ్చలవిడి విలాసకేంద్రాలు పెట్టినా.. వీధికో వసూలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నా `అక్కడ అడిగే దమ్మెవడికీ లేదు. ఒకవేళ అలాంటి సాహసానికి ఒడిగడితే భూమ్మీద బతికే అవకాశమే లేదు. కర్నూలు అతని దుర్గం. పాణ్యం అతని పాపాలకు విలాసం. నిలువెత్తు అవినీతికి వన్ అండ్ ఓన్లీ కటౌట్ `పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి.
తడిగుడ్డతో గొంతు కోయగల సౌమ్యుడు. అధికారం అండతో ఆస్తులు సంపాదించగల అసాధ్యుడు. కాటసాని కన్ను పడిరదంటే వక్ఫ్ భూములైనా, ప్రభుత్వ భూములైనా, పోరంబోకు భూములైనా అతని ఖాతాలో పడాల్సిందే. నడిరోడ్డుమీద హత్యలు చేసి సాక్ష్యాలను తారుమారు చేయగల నేర్పరి. దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు అన్నీ కాటసాని కనుసన్నల్లోనే జరుగుతాయి. కానీ ఆయన పేరు బయటకు రాదు.
ఖాళీ స్థలం కన్పిస్తే కాటసాని కబ్జా గ్యాంగ్ వాలిపోతుంది. బెదిరించో భయపెట్టో.. కోట్ల రూపాయల విలువ చేసే భూములు బలవంతంగా లాక్కున్న కథలు ఇక్కడ కోకొల్లలు. నచ్చిన స్థలం ఏదైనా, ఎవరిదైనా.. కాటసాని గుప్పెట్లోకి రావడం ఖాయం. నకిలీ పత్రాలు, వీలునామాలు, దస్తావేజులు తయారు చేసేందుకు ఒక పెద్ద కార్యాలయాన్నే రాంభూపాల్‌రెడ్డి నిర్వహిస్తూ పాణ్యం ప్రజలకు నిద్రలేని రాత్రులు చూపిస్తున్నాడు.
అవినీతి అనకొండ కాటసాని అక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే కేజీఆఫ్ లాంటి పెద్ద కథే అవుతుంది. గ్రావెల్ మాఫియా, లిక్కర్ మాఫియా, మట్కా మాఫియా.. ఇలా అన్ని మాఫియాలకు కాటసానే కేంద్ర బిందువు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటసాని రాంభూపాల్‌రెడ్డి చెయ్యని దందా లేదు. పాల్పడని అవినీతి లేదు. అంగన్‌వాడీ పోస్టుల నుంచి పెన్షన్ల వరకూ అన్నింటిలోను కాటసానికి కప్పం కట్టాల్సిందే. ఈ ఐదేళ్లలో చేసిన దందాలతో వెయ్యి కోట్ల మేర ఆస్తులు కూడబెట్టాడన్నది పాణ్యంలో పసిపిల్లలు కూడా చెప్పే మాట.
పర్ఫెక్ట్ ప్లానింగ్..
ఏ అక్రమానికి ఒడిగట్టాలన్నా `కాటసాని పక్కా ప్లానింగ్ డిజైన్ చేసుకున్నాకే రంగంలోకి దిగుతాడు. ముందుగా తన అనుచరులను పంపించి కాంట్రాక్టర్లను బెదిరించడం, ఖాళీ భూముల్లో పాగా వేయడం, నచ్చిన స్థలాలను కబ్జా చేయడం వంటివి చేసిన తర్వాత.. పెద్ద మనిషిలా పంచాయతీ తన వద్దకు తెప్పించుకుంటాడు. అసలైన భూయజమానులకు మొండిచెయ్యి చూపించి కోట్ల రూపాయలు కొట్టేసే తీర్పు చెబుతాడు. కాటసాని దందాలో కొడుకూ, బావమరిదికీ ప్రత్యేక బాధ్యతలుంటాయి. నిజానికి సీన్లో ఉండేది వీళ్లే. నియోజకవర్గంతోపాటు జిల్లాలో కొన్నిచోట్ల జోరుగా భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, వసూళ్లలో కాటసాని పేరు మారుమోగుతోంది.
పోస్టింగ్‌కో రేటు
వైసీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీచర్ల బదిలీల నుంచి పోలీసుల పోస్టింగ్ వరకు ప్రతి పనికీ ఒక రేటు కామన్. కానీ అందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే కాటసాని కోడుకు ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టి మరీ డబ్బు వసూలు చేయడం పరిపాటి. టీచర్ల బదిలీకి లెటర్ ఇవ్వాలంటే రూ.2 లక్షలు పుత్రరత్నానికి అప్పగించాలి. ఎమ్మార్వో పోస్టింగ్‌కు రూ.10 లక్షలు, ఆర్డీవో పోస్టింగ్‌కు రూ.25 లక్షలు, రిజిస్ట్రార్ పోస్టింగ్‌కు రూ.25 లక్షలు చొప్పున వసూలు ఇక్కడ షరామామూలు. పోలీసుల పోస్టింగులోనూ కోట్లు కొల్లగొట్టాడన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి నెలకు రూ.20 లక్షలు చెల్లించాలన్నది కాటసాని పెట్టిన రూల్.
వందలాది ఎకరాలు కబ్జా
అధికార బలాన్ని ఉపయోగించి పేద, మధ్యతరగతి వర్గాల భూములను బలవంతంగా లాక్కొంటూ భూదందా కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వ, ప్రైవేటు ఏ భూములకైనా సరే రాత్రికి రాత్రి పట్టాలు సృష్టించి చాప చుట్టేయడంలో కాటసాని సిద్ధహస్తుడు. దళితుల శ్మశాన స్థలాన్నీ వదలకుండా మింగేసిన అనకొండ కాటసాని. అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూస్తానని బెదిరించడం, అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం. ఇదీ కాటసాని చట్టం.
కొడుకు ఆగడాలకు అడ్డే లేదు
కాటసాని పుత్రరత్నం కాటేయడంలో తండ్రిని మించినవాడు. కాటసాని శివనరసింహారెడ్డి ఆగడాలకు అంతే లేదు. భూదందాలు, ఎర్రమట్టి మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, సెటిల్‌మెంట్ వ్యవహారాలన్నీ శివనరసింహారెడ్డి చేతుల మీదుగానే నడుస్తుంటాయి. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో 1000 మె.వా. సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే వైసీపీ అధికారంలోకి రాగానే కాటసాని కుటుంబం గన్నుపెట్టి బెదిరించి మరీ కోట్లు గుంజారు. నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి బెదిరించి పైసలు వసూలు చేయడంలో కాటసాని కొడుకు ముందుంటాడు.
దేవుడి భూములనూ వదల్లేదు
పాణ్యం నియోజకవర్గంలోని నేషనల్ హైవే 44కు దగ్గరలో ఉన్న దేవాదాయ భూమినీ మింగేసిన చరిత్ర కాటసానిది. బరితెగించి దేవుడి ఆస్తులూ స్వాహా చేశారు. దేవాలయ మాన్యం కింద ఉన్న 7 ఎకరాల భూమిని ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించారు.
వక్ఫ్ భూములు స్వాహా
వక్ఫ్ భూములనూ వదలకుండా స్వాహా చేశారు. అక్రమాలను ప్రశ్నించిన మైనారిటీ సోదరులపై దాడులకు పాల్పడ్డారు. పాణ్యం పట్టణంలో షాషా మసీదుకు చెందిన 6 ఎకరాలు, అల్లీషా మసీదుకు చెందిన 7 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వక్ఫ్‌బోర్డు భూములు ఏవిధంగా ఆక్రమిస్తారని ప్రశ్నించిన మైనారిటీ పెద్దలను ఇంటికి పిలిపించి మరీ బెదిరించారు. ఈ భూముల విలువ రూ.45 కోట్ల వరకు ఉంటుంది. కాటసాని కుటుంబసభ్యులే కాదు అనుచరులు, పీఏలు కూడా పెద్దఎత్తున దందాలకు పాల్పడుతున్నారు.
పట్టపగలే హత్యలు
పాణ్యం నియోజకవర్గంలో శాంతిభద్రతలు ఎప్పుడో అటకెక్కాయి. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కాటసాని కుటుంబ అవినీతి, అక్రమ బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చే నేతలు, కార్యకర్తలపై మారణహోమాన్ని కొనసాగిస్తున్నారు. బంధువు దినం కార్యక్రమం కోసం స్మశానానికి వెళ్లి వస్తున్న నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలను కారుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో అతి దారుణంగా హతమార్చారు. గత ఐదేళ్లలో 42మంది తెదేపా కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. హత్యలు, అక్రమ కేసులు అన్నీ కాటసాని డైరెక్షన్‌లోనే సాగడం జగమెరిగిన సత్యం.
భూమంతా కాటసానిదే..
1. ముజఫర్‌నగర్ సర్వే నెం.524లో 2 ఎకరాల వక్ఫ్ భూమి రూ.27 కోట్లు.
2. కల్లూరు, సున్నంగుడి సమీపంలోని సర్వే నెం.182లో 5 ఎకరాల పోరంబోకు భూమి రూ.30 కోట్లు.
3. ఓర్వకల్లు మండలం పిన్నాపురంలో 75ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములు అన్యాక్రాంతం రూ.40 కోట్లు.
4. ఉలిందకొండ గ్రామంలో రాగమయూరి వెంచర్స్‌లో యాజమాన్యాన్ని బెదిరించి రాంభూపాల్‌రెడ్డి భార్య పేరు మీద 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ రూ.28 కోట్లు.
5. ఓర్వకల్లు మండలం పులిచర్లలో 11 ఎకరాల భూమి కబ్జా రూ.8 కోట్లు.
6. ఓర్వకల్లు మండలం బైరాపల్లిలో 110 ఎకరాలు రూ.60 కోట్లు.
7. గడివేముల జెడ్పీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి కొడుకు కలిసి కల్లూరు మండలం, బస్తిపాడు గ్రామంలో టీడీపీ సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి30 ఎకరాలు కబ్జా, రూ.40 కోట్లు.
8. కర్నూలు నగర శివార్లలో 590 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జగన్నాథగుట్టను ప్రభుత్వ భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌గా ఉంచితే, రాత్రింబవళ్లు భారీ యంత్ర పరికరాలను తీసుకొచ్చి 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఎర్ర మట్టిని అక్రమంగా తరలించారు.
తుంగభద్ర ఇసుక మాయం
తుంగభద్ర నది నుంచి తట్ట ఇసుకను ఇంటి నిర్మాణం కోసం తీసుకుంటే అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారులు ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలకు మాత్రం వంతపాడుతున్నారు. తుంగభద్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, బిల్లులు లేకుండా రాత్రింబవళ్లు పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. లారీ ఇసుక రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్ముతూ కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.
పేకాట కేంద్రాలు
నియోజకవర్గంలో పేకాట కేంద్రాలను రేయింబవళ్లు నిర్వహిస్తూ వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు కాటసాని టీం. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలోనే పేకాట కేంద్రాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఘనత ఈయనదే. ఎమ్మెల్యే కాటసాని బావమరిది దగ్గరుండి పేకాట కేంద్రాలను సమన్వయం చేస్తున్నాడన్నది వైసీపీ నేతలు చెప్తున్న మాటే.