- ఆదాయాలు పెంచడమెలాగో మాకు తెలుసు
- అమరావతి ద్వారా వచ్చే రూ. 3 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆవిరి చేసిన జగన్‌రెడ్డి
- ప్రజల ఆస్తులను కబళిస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం
- మా లక్ష్యం వికసిత ఆంధ్ర` జగన్ లక్ష్యం ఉత్తర కొరియా
- మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు
అమరావతి,చైతన్యరథం: ‘‘2019 నాటికి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో సంపద సృష్టించాం. అందుకు ఒక్కటే ఉదాహరణ. ఐదేళ్లలో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి నీరు అందుబాటులోకి తెచ్చి కియా పరిశ్రమ ఏర్పాటు అయ్యేలా చూశాం. మొదటి కారు నా చేతుల మీదుగానే ప్రారంభమయింది. ఇప్పటి వరకు 12 లక్షల కార్లు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. 12 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. మరో 18 వేల కుటుంబాలకు పరోక్ష ఉపాధి లభించింది. మొత్తంగా 30 వేల కుటుంబాలకు ఆదాయం పెరిగింది. కియా పరిశ్రమ ద్వారానే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఆదాయం లభించింది. ఈ విధంగా సంపద సృష్టించడం ఎన్డీయే కూటమికి తెలుసు. రానున్న కాలంలోనూ ఇదే విధంగా సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. కానీ జగన్‌రెడ్డి మాత్రం అప్పులు చేసి డబ్బులు పంచాడు. దీంతో అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడిరది. చివరకు ఆస్తులు జప్తు చేసే స్థితి వచ్చింది. నా ఐదేళ్ల పాలనలో చెరువు నిండా నీళ్లు నింపి పెడితే వాటన్నింటినీ కాలువల ద్వారా జగన్‌రెడ్డి మళ్లించుకున్నాడు. కానీ చెరువు నింపే ప్రయత్నం చేయలేదు. దీంతో రానున్న ఐదేళ్లలో తానేమీ చేయలేనని జగన్‌రెడ్డి చేతులేత్తేశాడు. ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాడు. కానీ రాష్ట్రంలోని ఎన్డీయే కూటమికి సంపద సృష్టించగలదనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. సంపద సృష్టించడంలో టీడీపీకి ఓ చరిత్ర ఉంది. జనసేన కూడా సంపద సృష్టించి మెరుగైన సంక్షేమాన్ని అమలు చేయాలని అంటోంది. 2047 నాటికి వికసిత భారత్ కావాలని ప్రధాని మోదీ అంటున్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్ర కావాలని నేను భావిస్తున్నాను. ఆంధ్ర ప్రజలు ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలవాలి. ఆ దిశగా మేం కృషి చేస్తాం. అదే జగన్ అయితే రాష్ట్రాన్ని ఉత్తర కొరియా చేయాలనుకుంటున్నారు’’ అని ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారంటూ విలేకరులు ప్రశ్నించగా..1994`95లో తాను అధికారంలోకి వచ్చే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఆ స్థితా నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించామని, మిగులు బడ్జెట్‌లోకి తీసుకొచ్చామని, సంపద సృష్టించడంలో తమకు ట్రాక్ రికార్డు ఉందని, రానున్న ఐదేళ్లలోనూ అదే చేస్తామని చెప్పారు. కానీ జగన్ రెడ్డి ఆదాయాలు పెంచే చర్యలు ఏవీ చేపట్టకుండా అప్పులు చేసుకుంటూ వెళ్లిపోయాడని, ఆస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని ధ్వజమెత్తారు. దీనికి అమరావతి రాజధానే పెద్ద ఉదాహరణ అని, అమరావతిని విధ్వంసం చేయకుండా ఉండి ఉంటే నేడు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, అది చేయకపోగా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని, ఇప్పుడు దానికి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరదని తెలిపారు. మంగళవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి టీడీపీ, జనసేన కలిసి రూపొందించిన 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. డ్రైవింగ్ చేతకాని వాణ్ని డ్రైవర్ సీటులో కూర్చోబెడితే ఆతనికి నడపడం చేతకాకపోగా రివర్స్ డ్రైవింగ్ చేశాడని, దీంతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయానికి తలసరి ఆదాయంలో తెలంగాణాకు, ఆంధ్రాకు మధ్య 35 వేల రూపాయల వ్యత్యాసం ఉంటే…తాను ఐదేళ్ల పాటు శ్రమించి దాన్ని 27 వేల రూపాయలకు తగ్గించామని, కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేక ప్రజలకు ఆదాయాలు తగ్గిపోయాయని, దీంతో ఆ వ్యత్యాసం 45 వేల రూపాయలకు చేరుకుందని చెప్పారు. ప్రజలకు కొనుగోలు శక్తినే లేకపోతే ఇక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రజలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఆరుద్ర అనే మహిళ వారణాసికి వెళ్లిపోయిందని, రంగనాయకమ్మ అనే మహిళ భుక్తి కోసం పక్కరాష్ట్రానికి వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. వైసీపీ నాయకులు… ప్రజలు 30, 40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను బెదిరించి, భయపెట్టి లాగేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో పోర్టులు, సెజ్‌లు, స్టూడియోలు, క్వారీలు, మైన్లు ఎందుకు చేతులు మారుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయివేట్ ఆస్తులన్నింటికీ కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, జగన్‌రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని తెలిపారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తాము ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు అందుతుందని రాష్ట్ర ప్రజలకు భరోసా నిచ్చారు. చేపలు ఇవ్వడంతోపాటు చేపలు పట్టే శక్తిని కూడా ప్రజలకు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా కూటమి అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ గెలిపించాలని చంద్రబాబు కోరారు. బీజేపీ జాతీయ స్థాయిలో వారి మేనిఫెస్టోను ప్రకటించిందని, దీంతో రాష్ట్ర స్థాయిలో జనసేనతో కలిసి తాము ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించామని, దీని అమలుకు బీజేపీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు.