- సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తున్న ప్రజాదర్బార్
- ప్రజా విజ్ఞప్తులపై అప్పటికప్పుడే లోకేష్ ఆదేశాలు
- మంత్రి చొరవపట్ల బాధితుల హర్షాతిరేకాలు
- 42వ రోజు ‘ప్రజాదర్బార్’కు విన్నపాల వెల్లువ
అమరావతి (చైతన్య రథం): గత వైసీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి వేసారిన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘‘ప్రజాదర్బార్’’ అండగా నిలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 42వ రోజు నిర్వహించిన ‘‘ప్రజాదర్బార్’’ కు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి.. ఆయా విన్నపాల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు మంత్రి చూపిస్తున్న చొరవ పట్ల అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి సెగ్మెంట్ నుంచి..
గత ప్రభుత్వం నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ పునరుద్ధరించండి
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు ఎలాంటి ఆధారంలేదని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన పి.సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్న తనకు మందులు కొనుగోలు చేసేందుకు కూడా ఆర్థిక స్థోమత లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవడంతోపాటు ఇల్లు మంజూరు చేయాలని యర్రబాలానికి చెందిన షేక్ నసీమ కోరారు. పరిశీలించి తగిన విధంగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే, పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కుంచనపల్లికి చెందిన బి.కృపారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ చదివిన తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగావకాశం కల్పించాలని తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన ఏ.పెద్దిరాజు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం నిలిపివేసిన రైతుకూలీ పెన్షన్‌ను పునరుద్ధరించాలని యర్రబాలానికి చెందిన సీహెచ్ రమాదేవి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులోని పులివాగు ఆక్రమణలు తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గుంటక సుబ్బారెడ్డి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పులివాగు ఆక్రమణలతో తమ పంటలు ప్రతి ఏడాది ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని అర్జీలో పేర్కొన్నాడు. పులివాగు హిందూ స్మశాన వాటికనుంచి విజయవాడ- భద్రాచలం రోడ్డుపై నిర్మించిన వంతెన వరకు ఇరువైపులా భారీగా ఆక్రమణలకు గురై వాగు కుచించుకుపోయింది. దీంతో వర్షాకాలంలో సంభవిస్తున్న వరదలకు పంట పొలాలు నీట మునుగుతున్నాయి. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. వరదల బారిన పడకుండా గ్రామాన్ని రక్షించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
కడప జిల్లా కలసపాడు మండలం ముద్దంవారిపల్లికి చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. శంకవరం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు వారసత్వంగా సంక్రమించిన సుమారు 20 ఎకరాల ఈనాం భూములను సగిలి బాలచిరంజీవి, సగిలి పుల్లయ్య, మేక ఓబయ్య, దేవరాజు, మరికొందరు కలిసి ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు భూములను ఆన్ లైన్ లో నమోదు చేయించి.. తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తిరుపతిలోని శీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత మూడేళ్ల నుంచి పనిచేస్తున్న 30 మంది బోధనేతర సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని నాన్ టీచింగ్ సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా కొత్తపేటలోని తమ 1.10 ఎకరాల భూమిని గరిమెళ్ల నరసింహారావు అనే వ్యక్తి కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుదె వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. వృద్ధాప్యంలోవున్న తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు తమ ఇళ్లు నీట మునిగి ఇంట్లోని సామాగ్రి, నిత్యవసరాలు పాడైపోయాయని, ద్విచక్రవాహనాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, పరిహారం అందించి ఆదుకోవాలని నందమూరి నగర్, అంబాపురానికి చెందిన పలువురు బాధితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన వెన్నెం బాలగంగాధర్ తిలక్ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. 45 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన 10.39 ఎకరాల వ్యవసాయ భూమిని నిషేధిత జాబితాలో చుక్కల భూమి కింద చేర్చారని, విచారించి తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సదరు భూమిని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నామని, పట్టాదారు పాసు పుస్తకం కూడా మంజూరైందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వాపోయారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.