- రెండు వారాల్లో అధికారుల కమిటీ
- కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ముగ్గురేసి అధికారులు
- అక్కడ పరిష్కారం కాని అంశాలు మంత్రుల కమిటీ ముందుకు
- చివరిగా సీఎంల పరిశీలనకు
- డ్రగ్స్ నియంత్రణకు రెండు రాష్ట్రాల అధికారులతో సమన్వయ కమిటీ
- తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి వెల్లడి
- ఇది తెలుగుజాతి హర్షించే రోజు: అనగాని
హైదరాబాద్: విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణ కోసం కమిటీలు వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో శనివారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడిరచారు. తొలుత భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పదేళ్లుగా పరిష్కరానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నామన్నారు. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలనుకునే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలకు మొదటి సమావేశంలోనే పరిష్కారాలు దొరుకుతాయని అనుకోలేదన్నారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ముఖ్యమంత్రుల భేటీలో రెండు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురేసి అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించాం. అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించాం.
డ్రగ్స్‌పై సమన్వయ కమిటీ
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, తెలుగు రాష్ట్రాల మధ్య డ్రగ్స్ రవాణాను నియంత్రించేందుకు సమన్వయంతో పనిచేసేందుకు ఓ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించామని భట్టివిక్రమార్క తెలిపారు. సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకుపోతున్న ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. అడిషనల్ డీజీ స్థాయిలో ఇద్దరు అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటుచేస్తామన్నారు.
తెలుగుజాతి హర్షించే రోజు: అనగాని
ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగిన రోజు తెలుగు జాతి హర్షించే రోజు అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు మందుకు రావడం శుభపరిణామమన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు పనిచేస్తున్నారన్నారు. నిరంతరం ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తూ, అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు విభజనచట్టంలో అంశాలపై చర్చించేందుకు సమావేశమవుదామని రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారని.. తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. విభజన సమస్యలపై చర్చించామని..అందరి సలహాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు.
తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.