విజయవాడ(చైతన్యరథం): విజయవాడ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనం రూ.10.61 కోట్లు విరాళంగా ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనం మొత్తం రూ. 10,61,18,614 సీఎం సహాయ నిధికి అందజేస్తూ మంగళవారం సమ్మతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ కలెక్టరేట్లో మాట్లాడుతూ గత పది రోజులుగా విజయవాడ నగరంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి బాధితులకు అండగా నిలబడి పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారన్నారు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ముఖ్యమంత్రి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. 3-4 లక్షల విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు ఒకరోజు జీతం 10 కోట్ల 61 లక్షల 18 వేల 694 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడం మంచి పరిణామం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అందిస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఏపీ విద్యుత్ జేఏసీ చైర్మన్ సాన కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సహకరిస్తున్నారన్నారు. విభజన సమయంలో కూడా విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సహకారం మరువలేనిది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు.