24.11.2024 ఆదివారం అవినీతి పుత్రిక సాక్షి ఎడిట్ పేజిలో సోలార్ విద్యుత్ కుంభకోణంలో జగన్ ముడుపులు కప్పిపెడుతూ, షరా మామూలుగా చంద్రబాబుపై నిందలు మోపుతూ మురళి సుదీర్ఘ వ్యాసం రాశారు. జగన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని ఎల్లో మీడియా హననం చేస్తున్నదనే మురళీ ఆరోపణ అబద్ధం. వ్యక్తిత్వ హనన పేటెంట్ జగన్ రోత మీడియాదేగాని మరెవ్వరిదీ కాదనేది జగమెరిగిన సత్యం. చిన్నాన్న హంతకుల్ని కాపాడడానికి చిన్నాన్న వ్యక్తిత్వ హనన రాతలు రాసింది సాక్షినే. గొడ్డలి వేటును గుండెపోటుగా ప్రసారం చేసింది సాక్షి ఛానలే. తన కుటుంబీకులు చేయించిన వివేకా హత్యను నారాసుర రక్తచరిత్ర అంటూ పెద్ద అక్షరాలతో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అబద్ధాలు రాసింది సాక్షినే. సునీత తన తండ్రిని హత్య చేయించిందనే వికృత రాతలు రాసింది రోత మీడియానే. తల్లి, చెల్లి శీల హననం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దుర్మార్గుల్ని వెనకేసుకొస్తున్నది, కాపాడుతున్నది మీ అధినేతే కాదా? జగన్ ముఠా చేసిన హత్యలు, వ్యక్తిత్వ హననాలు రాస్తూ పోతే ఒక గ్రంథమే అవుతుంది.
తన దుష్ట లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే వందసార్లు రాయించడం జగన్ నైజం. 2004లో రూ.2 కోట్లలోపు ఆస్తివున్న జగన్, నేడు లక్షల కోట్లకు ఎలా ఎగబాకారు? ఈ రేంజ్‌లో పెరిగిన నేత తెలుగు రాష్ట్రాలలో మరెవ్వరూ లేరు ఎందుకు? జగన్ నడమంత్రపు సిరికి దోపిడీ కారణం కాదా? అతనిపై వున్న 38 కేసులు అక్రమమైతే.. కోర్టు వాయిదాలకు హాజరై కొట్టి వేయించుకోవచ్చు కదా? 11 ఏళ్ళ నుండి సీబీఐ కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు?
సెకీ 2021 జనవరి 30న గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో యూనిట్ రూ.1.99 చొప్పున ఒప్పందం చేసుకొన్నది. జగన్ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో ఎలా ఒప్పందం చేసుకొంటారు? చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య రాయలసీమలో 7 వేల మెగావాట్ల సామర్థ్యంగల విండ్, సోలార్ ప్లాంట్లు స్థాపించి 13 వేలమంది స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఆ ప్లాంట్ల స్థాపనవల్ల రైతుల భూమి విలువ పెరిగింది. ప్రభుత్వానికి పన్నులు వచ్చాయి. రాజస్థాన్ సోలార్ అధిక రేట్లకు కొనడం ఒక నష్టమైతే, రాయలసీమ యువతకు ఉద్యోగాలు రాని స్థితి రెండవది. ఇంత నష్టకరమైన లక్ష కోట్ల ఒప్పందం మడుపులకుకాక మరెందుకు చేసుకొన్నట్లు?
గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమలో స్థాపించిన సోలార్, విండ్ ఒప్పందాలు 20 ఏళ్లకు చేసుకొంటే విమర్శలు చేసి ఆ పీపీఏలను రద్దు చేసుకొన్న జగన్, సెకీతో 25ఏళ్ళకు ఎందుకు ఒప్పందం చేసుకొన్నారు? చెప్పేదొకటి చేసేదొకటి కాదా? సెకీ ఒప్పందం దాదాపు లక్ష కోట్ల విద్యుత్ ఛార్జీల బేరాలకు సంబంధించినది.
ఇంత పెద్ద ఒప్పందాన్ని టేబుల్ ఐటెమ్‌గా క్యాబినెట్‌కు పెట్టడమంటే అందులో ముడుపుల కుట్ర లేదా? విద్యుత్ మంత్రి సంతకం కూడా లేకుండా కేబినెట్‌కు ఎందుకు పెట్టారు? సోలార్ విద్యుత్‌ను రూ.2.49కి కొనాలంటూ 2021 సెప్టెంబర్ 15న సెకీ జగన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2021 సెప్టెంబర్ 16న అంటే ఒక్క రోజు వ్యవధిలోనే కేబినెట్ సమావేశం పెట్టి సెకీ అనుకూల నిర్ణయం వెనుక కుంభకోణం లేకుంటే ఆగమేఘాలపై ఒక్కరోజు వ్యవధిలోనే ఒప్పందానికి అనుకూల తీర్మానం చేయరు కదా? జగన్‌కు స్వీయ ప్రయోజనం లేకుంటే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకొంటారా?
సాగర్ అదానీ ఫోన్ మెసెజ్‌ల ఆధారంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్‌బిఐ నేరారోపణ చేసింది. దీనిపై అమెరికా న్యాయ శాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. జగన్ పేరుగానీ, ప్రస్తావనగానీ రిపోర్టులో ఎక్కడా లేదని మురళీ వ్యాసంలో మరో అబద్ధం రాశారు. రాష్ట్ర నెం1తో సహా ఏపీ ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చినట్టు ఎఫ్‌బిఐ రిపోర్టులో పేర్కొన్నారు. నెంబర్ 1.. మే 2019 నుండి జూన్ 2024 వరకు ఏపీలో అధికారంలో ఉన్నట్టు రిపోర్టులో వుంది. గౌతం అదానీ ఏపీ సీఎంను కలిసినట్టుగా కూడా ఎఫ్‌బిఐ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంతస్పష్టంగా జగన్ ప్రస్తావనవుంటే, లేదని మురళీ అబద్ధం రాశారు. మొత్తం 2029 కోట్లు లంచాలు చేతులు మారాయి. అందులో ఏపీ రూ.1750 కోట్లు కాగా, మిగిలిన నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒడిస్సా, చత్తీస్‌గఢ్, కాశ్మీర్ పెద్దలకు రూ.279 కోట్లు ముట్టాయి. చంద్రబాబు విద్యుత్ భారాలు మోపాడని, జగన్ విద్యుత్ రంగాన్ని ఉద్దరించాడని మురళీ మరో అబద్ధాన్ని రాశాడు.
వాస్తవాన్ని తలక్రిందులు చేశారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి 22.5 మిలియన్ యూనిట్లు లోటు ఉండేది. 2014-19 మధ్య 10 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల విద్యుత్ ప్లాంట్లు స్థాపించి చంద్రబాబు మిగులు విద్యుత్ జగన్ చేతిలో పెట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో కొత్త విద్యుత్ ప్లాంట్లు స్థాపించలేదు. ఉన్న జన్‌కో ప్లాంట్లలో సరిగా విద్యుదుత్పత్తి చేయలేదు. కమిషన్ల కోసం అధిక ధరలకు ప్రయివేటు విద్యుత్ కొన్నారు. బొగ్గు, విద్యుత్ పరికరాలు ప్రక్క రాష్ట్రాలతో పోలిస్తే రెట్టింపు రేట్లకు కొన్నారు. 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. కరెంటు కోతలు పెట్టారు. కమిషన్ల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లుపెట్టి రైతు మెడకు ఉరి వేయబోయాడు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లుపెట్టే పథకాన్ని రద్దు చేసింది.
ఈరోజు రాష్ట్రంలో సుమారు 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల విద్యుత్ ప్లాంట్లు ఉంటే అందులో 15 వేల మెగావాట్లు సామర్థ్యం గల ప్లాంట్లు స్థాపించింది చంద్రబాబు ప్రభుత్వాలే. జగన్ విద్యుత్ రంగంలో 1.29 లక్షల కోట్లు భారాలు మోపినా కొత్తగా ఒక్క విద్యుత్ ప్లాంటు కూడ స్థాపించలేదు. విద్యుత్‌రంగాన్ని దోచుకుతిన్నారు. టీడీపీ హామీల అమలు వైఫల్యం చెందిందని, దాని డైవర్షన్‌కు జగన్‌పై నిందలు చేస్తున్నారని పాచి పాటే మురళీ పాడారు. ప్రతిపక్ష నేతగా జగన్ వైఫల్యం చెందారు. చాక్‌లెట్ కొని ఇవ్వకుంటే బడికెళ్ళనని పిల్లాడు మొండి కేసినట్లు, అర్హతలేకున్నా పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వితండ వాదంతో ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. కుటుంబ పెద్దగా కూడా విఫలమయ్యారు. 2019లో అధికారం చేపట్టిన జగన్ మొదటి 5నెలల్లో అమలు చేసింది రెండు హామీలు మాత్రమే. రూ. 250 ఫించన్ పెంచి, డ్రైవర్లకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మరే నవరత్న హామీ అమలు చేయలేదు. ఖజానా దివాళా తీసివున్నా చంద్రబాబు ఒకేసారి ఫించన్ రూ.1000 పెంచారు. అన్న క్యాంటీన్లు పెట్టారు. ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. ఉచిత ఇసుక ఇస్తున్నారు. విషపూరిత మద్యం రద్దు చేసి నాణ్యమైన మద్యం ఇస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. కేంద్రం నుండి విభజన హక్కులు కొన్ని సాధించారు. ఇలా ఐదు నెలల్లోనే 150కి పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి ఆదర్శ పాలన చేస్తున్నారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్ధికి డైవర్షన్ చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? తన దోపిడీ, నేరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దొంగే దొంగ అన్నట్లు డైవర్షన్ అంటూ ఎదురుదాడి చేస్తున్నది జగన్ ముఠానే.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్