అమరావతి: గత 15 రోజులుగా తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైకాపా ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదని బుధవారం ఒక ప్రకటనలో లోకేష్ ఆరోపించారు. వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలపై ఉద్యమిస్తున్న అంగన్వాడీల పై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమే. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ…తమ డిమాండ్లపై ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంగన్వాడీలకు లేవా? విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
అమానవీయంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలపై సైకో సర్కారు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్న వనమ్మ అనే అంగన్‌వాడీ వర్కర్ దారిలోనే సంగం మండలం తరుణవాయిలో అశువులు బాయడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడం వల్లే అంగన్వాడీ వర్కర్ వనమ్మ బలైంది. ప్రభుత్వ అలసత్వం, జగన్ నియంత పాలన అంగన్ వాడీలకు శాపంగా మారింది. ఇప్పటికైనా దున్నపోతు ప్రభుత్వం మొద్దునిద్ర వీడి మానవతా దృక్పథంతో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.