అమరావతి(చైతన్యరథం); సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. భారత బ్యాడ్మింటన్కు మరో చారిత్రాత్మక విజయా న్ని అందించిన ఈ స్టార్ జంట దేశానికి గర్వకారణంగా నిలిచింద ని వ్యాఖ్యానించారు. సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రపంచ వేదికపై భారత్కు మరోసారి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చాయని.. వారి అద్భుత ప్రతిభ, అచంచల పట్టుదల, నిరంతర కృషికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి విజయంపై ప్రత్యేకంగా గర్విస్తున్నా మని సీఎం వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సాధిస్తున్న విజయాలు రాష్ట్ర యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతున్న ఈ జోడీ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశం కోసం మరిన్ని పతకాలు, టైటిళ్లు సాధించి భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించాలని శుభాకాంక్షలు తెలిపారు.
సాత్విక్ విజయం గర్వకారణం: ఎంపీ సానా సతీశ్
సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెం ట్లో సాత్విక్ సాయిరాజ్ విజయంపై తెలుగుదేశం ఎంపీ సానా సతీశ్ హర్షం వ్యక్తం చేశారు. పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన సాత్విక్ విజయం గర్వకారణమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత దేశానికి స్వర్ణ పతకాన్ని అందించడం సంతోషకరమని పేర్కొ న్నారు. సాత్విక్ విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని అభినందించారు. క్రీడల పట్ల అంకితభావం, కఠోర శ్రమ ఉంటే ప్రపంచస్థాయిలో విజయాలు సాధించవచ్చని మరోసారి నిరూపించడం గొప్ప విషయమని తెలిపారు.















