- యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించండి
- ఏపీలో ఫార్మా, అగ్రి ఎక్స్పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించండి
- స్టెర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ
మాస్కో: రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ (Mr Albert Yefimov)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ” వెస్ట్రన్ ప్లాట్ఫాంలకు సురక్షితమైన లోకలైజ్డ్ జనరేటివ్ ఏఐ ప్రత్యామ్నాయ వ్యవస్థను అందించిన తరహాలోనే భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,రిటైల్ రంగాలకు స్బేర్బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించండి. జాతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ స్బేర్ బ్యాంక్ యొక్క అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ ను భారతదేశ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లో ఇంటిగ్రేట్ చేసేలా సాంకేతికసహకారం అందించండి.
భారత్లో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా స్బేర్ బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ సిస్టమ్లను విస్తరించండి. ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజనీర్లకు వేగంగా శిక్షణ ఇవ్వడానికి స్బేర్ బ్యాంక్ గేమిఫైడ్, పీర్-టు-పీర్ “స్కూల్ 21” కోడింగ్ అకాడమీలను భారతదేశంలోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఏర్పాటు చేయండి. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం దూర ప్రాంతాలకు రూపాయి- రూబుల్ వాణిజ్య అనుమతులు, వ్యవస్థీకృత రుణాలు అందించాలి” అని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ స్పందిస్తూ… తమ బ్యాంక్ భారత్లోని న్యూఢిల్లీ కార్యాలయం ద్వారా ద్వైపాక్షిక కమర్షియల్ ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, భారత్-రష్యా క్లయింట్ డెలివరీ సేవలు అందిస్తోందని చెప్పారు. బెంగళూరులోని తమ ఐటీ హబ్ సరిహద్దు వాణిజ్య పరిష్కారాలు, రూపాయి-రూబుల్ యంత్రాంగాలకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. న్యూఢిల్లీ, ముంబైల్లోని శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడికి గేట్వేలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. కీలక వాణిజ్య డెస్క్ ట్రెజరీ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాల మంజూరు, ఎంటర్ప్రైజ్ క్లయింట్ల కోసం ఏఐ-ఆధారిత డేటా విశ్లేషణలను నిర్వహిస్తున్నామన్నారు. స్బేర్ బ్యాంక్ గ్లోబల్ బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారా మాసివ్ లిక్విడిటీ, అడ్వాన్స్డ్ డిజిటల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
స్బేర్ బ్యాంక్ గురించి…
స్బేర్ బ్యాంక్… రిటైల్ బ్యాంకింగ్, క్లౌడ్ సేవలు, ఏఐ రంగాలకు విస్తరించిన ప్రభుత్వ నియంత్రణలోని ఒక ప్రధాన బ్యాంకు. మాస్కో కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ఈ బ్యాంకు 110 మిలియన్లకు పైగా రిటైల్, 3.5 మిలియన్ల కార్పొరేట్ ఖాతాదారులను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2.87 లక్షల మంది ఉద్యోగులున్న ఈ బ్యాంకు 2025 ఆర్థిక సంవత్సరంలో 15.6 ట్రిలియన్ రూబుల్స్ (రూ.2.07 లక్షల కోట్లు) ఆదా యాన్ని ఆర్జించింది. 12వేల శాఖలు కలిగిన స్బేర్ బ్యాంక్ ప్రతిరోజూ 8కోట్లకు పైగా డిజిటల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.













