అమరావతి(చైతన్యరథం): ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖరాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు పేర్కొన్నా రు. త్వరితగతిన తుఫాను నష్టంపై అంచనాకు కేంద్ర బృందాల ను పంపాలని కోరారు. తుఫాన్ సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆరఎఫ్, 11 ఎస్డీఆరఎఫ్ బృందాలను నియమించినట్టు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని తెలిపారు. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధప్రాతి పదికన చేపట్టినట్టు చెప్పారు.
70,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం
భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంటకు నీట మునిగినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకూ 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేలా కంట్రోల్ రూమ్లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు. ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలిపారు. తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. సహాయక చర్యలకు ఎన్డీఆరఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.


