.పార్టీకి తీరని లోటన్న చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు
.తూర్పుగోదావరిలో పెద్దదిక్కును కోల్పోయాం
.పార్టీ సీనియర్ నేతలు యనమల, నెహ్రూ, రాజప్ప సంతాపం
అనపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనపర్తి మాజీ శాసనసభ్యుడు, తూర్పుగోదావరిజిల్లా రాజకీయ దిగ్గజం నల్లమిల్లి మూలారెడ్డి సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న మూలారెడ్డి రాయవరం మునసబు శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లాలో తమకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించు కున్నారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో అన్న ఎన్టీఆర్ సమక్షంలో టిడిపిలో చేరిన మూలారెడ్డి తుదిశ్వాసవరకు పార్టీలోనే పనిచేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉన్న మూలారెడ్డి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. అనపర్తి నియోజకవర్గంలో 7సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అనితర సాధ్యమైన రికార్డు సాధించారు. 2014లో నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచీ పోటీ చేసి గెలుపొందారు. మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2014-19 నడుమ శాసనసభ్యుడిగా పనిచేశారు. మూలారెడ్డి తన 52 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికభాగం తెలుగుదేశం పార్టీలోనే పనిచేశారు. తొలిసారిగా 1970లో తమ స్వగ్రామం రామవరం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటినుంచి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు. 1970 – 83 వరకు రెండు సార్లు రామవరం సర్పంచ్‌గా పనిచేసారు. 1978లో రామచంద్రపురం కో ఆపరేటీవ్ సూపర్ బజార్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1981లో రాయవరం సమితి అధ్యక్ష పదవికి పోటీపడ్డారు.
లోకేష్ సంతాపం
తెలుగుదేశం సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి మరణం విచారకరమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అంటూ మూలారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అచ్చెన్నాయుడి సంతాపం
టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మృతి వార్త తమను తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. అనపర్తి నుంచి నాలుగుమార్లు శాసనసభ్యునిగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. రెండు దశాబ్ధాలపాటు శాసనసభ్యునిగా ఉంటూ పార్టీ అభ్యన్నతికి ఆయన చేసిన సేవలు అజరామరమన్నారు. అలాంటి సీనియర్ నేత తుది శ్వాస విడవడం పార్టీకి తీరని లోటని అంటూ మూలారెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
నల్లమల్లి మూలారెడ్డి అంత్యక్రియలకు టిడిపి ప్రతినిధి బృందం
టిడిపి సీనియర్ నేత నల్లమిల్లి మూలారెడ్డి అంత్యక్రియలకు పార్టీ తరపున సీనియర్ నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, కెఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు హాజరుకానున్నట్లు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మూలారెడ్డి మరణం పార్టీకి తీరనిలోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని పార్టీ పేర్కొంది.