- ప్రపంచబ్యాంకు, ఏడీబీని కోరిన సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రితో బ్యాంకుల ప్రతినిధుల భేటీ
- అమరావతికి రుణం మంజూరుపై చర్చ
- 27 వరకు రాజధానిలో బ్యాంకుల బృందం పర్యటన
అమరావతి(చైతన్యరథం): భవిష్యత్ మహానగరం అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోవాలని ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి మన ప్రణాళికలు, విజన్ గురించి ఈ సమావేశంలో బ్యాంకు ప్రతినిధులతో చర్చించామన్నారు. అమరావతి నిర్మాణ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వాలని ఈ రెండు బ్యాంకులను కోరామని చంద్రబాబు తెలిపారు.
అంతకు ముందు సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చే విషయమై ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేశాయి.
అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. పురపాలకశాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో రెండు బ్యాంకుల ప్రతినిధులు చర్చించారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులపై వారికి చంద్రబాబు సీఎం వివరించారు. రాజధానిలో ప్రభుత్వ ప్రాధాన్యతా ప్రాజెక్టులను, తమ విధాన నిర్ణయాలను బ్యాంకుల ప్రతినిధుల ఎదుట ప్రస్తావించారు.
దశల వారీగా నిధుల విడుదలపై చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూసమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు. కాగా రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటించి, గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించనున్నారు.