ఉండవల్లి: నవులూరుకు చెందిన ఖిద్మత్ టీమ్ అధ్యక్షుడు షేక్ షఫీ టీడీపీలో చేరారు. యువనేత నారా లోకేష్ సమక్షంలో బుధవారం తన అనుచరులు, మద్దతుదారులైన 200 మందితో కలిసి షఫీ పార్టీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గంలో షేక్ షఫీ అందరికి సుపరిచితమే. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఎన్నో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను, పేద కుటుంబాల వైద్య ఖర్చులకు సహాయ సహకారాలు అందించారు. అలాగే కోవిడ్ సమయంలో అనాథలు, పేదలకు విశేష సేవలందించారు. తమ కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గంలో అనాథ శవాలకు దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు. అందరికీ ఆత్మబంధువు అయ్యారు. ఎవరైనా అనాథలు ఇబ్బందుల్లో ఉంటే షఫీ ఒక్క ఫోన్ కాల్‌తో వాలిపోతారు. అటువంటి వ్యక్తి నారా లోకేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై బుధవారం ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.నీ సందర్భంగా ఖిద్మత్ అధ్యక్షుడు షేక్ షఫీ మాట్లాడుతూ అధికారంలోకి లేనప్పటికీ నియోజకవర్గంలో నారా లోకేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో లోకేష్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని, నారా లోకేష్‌ను భారీ మెజారిటీ తో గెలిపించి మన మంగళగిరిని ఆదర్శ మంగళగిరిగా చేసుకుందామని షఫీ వ్యాఖ్యానించారు. వీరితో పాటు కంఠంరాజుకొండూరుకు చెందిన 25 దళిత కుటుంబాలు, 25 యాదవ సామాజికవర్గ కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరందరికీ లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరుతున్న వారికి రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి లేని అనుకూలతలు మంగళగిరికి ఉన్నాయని, నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మిశెట్టి జానకిదేవి, దామర్ల రాజు, తోట పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.