- టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర
- పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు
- కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు.. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలొచ్చినా ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచిందన్నారు. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు.