- సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఐదు హామీలపై చంద్రబాబు ముందడుగు
- లబ్దిదారులు, సాధారణ ప్రజల సమక్షంలో హామీల అమలు ఫైళ్లపై సంతకాలు
- సచివాలయంలోని సీఎం ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ
- శాస్త్రోక్తంగా పూజలు, వేద పండితుల ఆశీర్వచనాలు
- శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, అధికారులు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. వెంటనే నవ్యాంధ్ర భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా ఐదు కీలక ఎన్నికల హామీలు అమలుకు సంబంధించిన ఫైళ్లపై ఆయా లబ్ధిదారుల సమక్షంలో సంతకాలు చేశారు. దీంతో ఆయా పథకాల లబ్ధిదారులు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు తన ఛాంబర్లోని వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కాగా, సీఎం చాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తరువాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు దారి పొడవునా అత్యంత ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి….రాహదారులు అన్నీ పూలమయం చేసి ముఖ్యమంత్రిపై అభిమానం చాటారు. అలాగే సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సహా మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మెగా డీఎస్సీపై తొలి సంతకం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఐదు ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేశారు. ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల సమక్షంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్‌పై తొలిసంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తానన్న రెండో హామీపై రైతుల సమక్షంలోనే సంతకాలు చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపైనా లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు. అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణన దస్త్రంపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ….గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత పెద్ద ఎత్తున తన ముందు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. జగన్ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు..ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు. దేశంలోనే ఎక్కువగా మన రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం రేటు ఉంది. దీంతో నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యోగాలు కల్పించాలని నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించాం. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ మేరకే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేశాను అని ప్రకటించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో అనేక సమస్యలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ఈ చట్టంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. భూమిని కొందరు కొన్నారు…కొందరికి వారసత్వంగా వచ్చింది. కానీ ఆ పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారు… ఇది ఎంత వరకు న్యాయం? దానం చేసినట్లు జగనన్న భూహక్కు అని రాసుకున్నారు. చట్టాన్ని తెచ్చి అమలు చేసే స్థానాల్లో ఆయన మనుషులను పెట్టుకుంటామన్నారు. సొంత మనుషులతో రికార్డులు మార్చడానికి ప్రయత్నించారు. రికార్డులు మార్చి సెటిల్మెంట్లు కూడా చేసుకున్నారు. ఒకసారి రికార్డులు మార్చితే హైకోర్టుకు వెళ్లాలి…హైకోర్టుకు వెళితే వివాదం తేలేందుకు ఏళ్లు పడుతుంది. అందుకే దీన్ని రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పెన్షన్ల పెంపుపై 3వ సంతకం
మొదటి సారి రూ.35తో పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. సమైక్యరాష్ట్రంలో నేను దాన్ని రూ.75కు పెంచాను. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.1000కి, తర్వాత రూ.2వేలకు పెంచాను. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా వెయ్యి రూపాయలు మాత్రమే పెంచింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్‌తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు నెలకు రూ. 1000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పాను. పెంచిన వాటితో కలిపి జులైలో రూ.7 వేలు పెన్షన్ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్ కూడా రూ.6 వేలకు పెంచాం… పెంచిన పెన్షన్ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ పెంచాము. ఇబ్బందులు పడేవారిని గుర్తించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
నైపుణ్య గణన పై 4వ సంతకం
యువతలో నైపుణ్యాల స్థాయి లెక్కించేందుకు, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకకు నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి..కానీ వాటిని సాధించుకోవాలంటే కావాల్సిన నాలెడ్జ్, నైపుణ్యం కావాలి. ఉన్నత చదువులు చదివినా…సరైన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదు. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు వెళ్తున్న సమయంలో తగిన స్కిల్స్ ఉంటే ప్రపంచంలో రాణించవచ్చు. ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కలు తీశారు..కానీ మొదటి సారిగా స్కిల్ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది…దేశంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి…దానికి తగ్గ స్కిల్స్ ఉన్నాయా లేదా అన్నది లెక్కిస్తున్నాం. పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుండి ఉద్యోగులు రాకుండా మనరాష్ట్రం నుండే కావాల్సిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి. కావాల్సిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని చంద్రబాబు పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై 5వ సంతకం
పేదవాళ్లకు అన్నం పెట్టాలన్న ఉద్దేశ్యంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు తీసుకొచ్చాం. రూ.5కే అల్పాహారం, రూ.5కు మధ్యాహ్న భోజనం, రూ5.కే రాత్రి భోజనం అందించాం. చిరుద్యోగులకు, కూలి పనులకు వెళ్లేవాళ్లకు ఆ క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడ్డాయి. కర్నాటకలో ఇందిరా క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు…మనం ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసేసింది. చాలా మంది అన్న క్యాంటీన్లలో భోజనాలకు విరాళాలు కూడా ఇచ్చారు. కానీ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రద్దు చేసి పైశాచిక ఆనందం పొందారు. అందుకే ఐదవ సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చేశాను. ఎన్ని క్యాంటీన్లు పెట్టాలి అనేది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. 5 సంతకాల ద్వారా లబ్ధి పొందే వర్గాల సమక్షంలోనే ముఖ్యమంత్రి ఆయా ఫైళ్లపై సంతకాలు పెట్టారు. ఇక ప్రజల పాలన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.