- పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మంత్రి లోకేష్ నియోజకవర్గం
- ఇంటింటికీ తిరిగి నైపుణ్య గణన చేస్తున్న యంత్రాంగం
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడనున్న స్కిల్సెన్సస్
మంగళగిరి (చైతన్యరథం): దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన మంగళగిరి నియోజకవర్గం నుంచి నైపుణ్య గణన ఆరంభమైంది. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించనున్నారు. గ్రామసచివాలయాలు, స్కిల్ డెవల్మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ హెడ్‌క్వార్టర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది తరువాత రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, ఇంకా అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.
పరిశ్రమలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ, ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా శిక్షణ, నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా లు నిర్వహించి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఎంత మంది నిరుద్యోగులున్నారు, వారి నైపుణ్యాలు ఏంటి, వారు ఏ వయస్సు వారు, ఏ ప్రాంతంలో ఉద్యోగం-ఉపాధి కోరుకుంటున్నారో అనే అంశాలు స్కిల్ సెన్సస్ ద్వారా సేకరించి…వీరందరికీ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్తర కార్యక్రమం తొలి అడుగు కోసం ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవవనరుల శాఖా మంత్రి లోకేష్ తన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. స్కిల్ సెన్సస్ ఆరంభం కావడంతో నిరుద్యోగుల్లో ఉపాధి ఆశలు చిగురిస్తున్నాయి.