- పోర్టులు, ఎయిర్ పోర్టులే ప్రగతికి మార్గాలు
- కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు నమూనాల పరిశీలన
- భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై రివ్యూ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్ పోర్టులను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్ ఎయిర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా…. పుట్టపర్తి ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్‌గా ఉంది. వీటికితోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిద్ధమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్ పోర్టులను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకు అడుగులు వేయగా… తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వాటిని పట్టాలెక్కించేందుకు, భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ పోర్టుల విస్తరణ, నిర్మాణంతోపాటు, కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం సమీక్షించారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు సహా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని- అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయనుంది. కుప్పం ఎయిర్ పోర్ట్ కోసం ఫీజిబులిటీ రిపోర్ట్ సిద్ధం చేశారు. రెండుదశల్లో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం జరగనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, 2వ దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1,250 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. అయితే దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్‌ఏఎల్, బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులున్న కారణంగా… ఎయిర్ స్పేస్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ఈ కారణంగా దీనికి సంబంధిత వర్గాలనుంచి ఎన్‌వోసి తీసుకోవాల్సి ఉంది.
శ్రీకాకుళం ఎయిర్‌పోర్టు విషయానికి వస్తే ఫీజిబులిటీ సర్వే పూర్తైంది. రెండు ఫేజుల్లో 1,383 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఫేజ్ 1లో 680, ఫేజ్ 2లో 536 ఎకరాల్లో దీన్ని చేపట్టనున్నారు.
దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. 1379 ఎకరాల్లో నిర్మించాలని నాడు నిర్ణయించగా… అందులో 635 ఎకరాల భూసేకరణ టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులున్నాయి. ఈ ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. వీటికితోడు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కార్గోకు, ఇండస్ట్రీకి ఉపయోగపడేలా మంచి ఎయిర్‌పోర్టు అవుతుంది. అదే విధంగా శ్రీ సిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్ట్ తెచ్చే అంశాన్నీ పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఒంగోలు ఎయిర్ పోర్ట్ కోసం 657 ఎకరాలు గుర్తించారు. దీనిపై ఫీజిబులిటీ స్టడీ చేయాల్సి ఉంది.
పల్నాడు జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ వద్ద 1670 ఎకరాల్లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి. తాడేపల్లిగూడెం ఎయిర్ పోర్టు 1123 ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీని సమీపంలో అటు రాజమండ్రి, ఇటు గన్నవరం ఎయిర్ పోర్టులున్నాయి. దీంతో ఇక్కడ ఎయిర్ పోర్టు ఫీజిబులిటీని పరిశీస్తున్నారు. ఇకపోతే తుని- అన్నవరం మధ్య 757 ఎకరాల్లో ఎయిర్ పోర్టు తేలవాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్, హైవే, వాటర్ బాడీ ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్, సిటీలు వస్తున్నాయని… ఆ ప్రాంతంలో ఎయిర్ పోర్టు అవసరం ఉందని సీఎం అన్నారు. అనకాపల్లి, కాకినాడ, విశాఖలకు దగ్గరలో ఈ ఎయిర్ పోర్టు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. అదే విధంగా… తాడిపత్రి ప్రాంతంలో ఒక ఎయిర్ పోర్టుకు అవకాశం ఉందని… దాన్నీ పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. టెర్మినల్ పనుల్లో నూతన డిజైన్లను అధికారులు సీఎం వద్ద ప్రదర్శించారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్థూపాలు థీమ్‌గా ఎయిర్ పోర్టు డిజైన్లు సిద్ధం చేశారు. ఈ పనులను 6 నెలల్లో పూర్తిచేసి జూన్‌నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్ పోర్టు పనుల పురోగతిని కూడా అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఎయిర్ పోర్టుల్లో ప్రైవేటు ఫ్లైట్స్ పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని… వాటనీ దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు.