- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- మంత్రి నారా లోకేష్‌కు మృతుడి తల్లి వినతి
- మున్నూరు కాపులకు కులధృవీకరణ పత్రాలు జారీ చేయాలి
- 51వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు
- సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ హామీ
అమరావతి (చైతన్యరథం): వేధింపులకు గురిచేసి తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎమ్.ఓబులమ్మ.. విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు శుక్రవారం మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఓబులమ్మ తన వినతిని అందించి న్యాయం చేయాలని కోరారు. వైసీపీ నాయకుడు ఈదరపల్లి రామ్మోహన్ వేధింపుల కారణంగా నా కుమారుడు మేకల గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. నిందితుడిపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.. అయితే కేసు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ రామ్మోహన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. విచారించి తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణ రక్షణ కల్పించాలని ఓబులమ్మ కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
రాష్ట్రం నలుమూలల నుంచి..
ప్రజాదర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ నుంచి శాశ్వతంగా వలస వచ్చిన మున్నూరు కాపులకు బీసీ-డీ కింద కుల ధృవీకరణ పత్రం జారీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని బాధితులు కోరారు. గత 20 ఏళ్లుగా విజయవాడలో నివసిస్తూ ఏపీఎస్బీసీఎల్ కార్పొరేషన్‌లో హమాలీలుగా పనిచేస్తున్నామని, అర్హత ఉన్నప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు జారీచేయకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల్లో తమ కుటుంబాలు నష్టపోతున్నాయని మంత్రికి వివరించారు. మున్నూరు కాపులకు బీసీ-డీ కింద కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో పొందుపర్చినప్పటికీ అధికారులు నిరాకరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్సు జగదీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సోకిన తన తండ్రికి వైద్య ఖర్చుల కోసం ఉన్న భూమిని విక్రయించి ఆయనను బతికించుకున్నామని, ఏ ఆధారం లేని తనను తిరువూరు మండలం చౌటుపల్లికి చెందిన కొంగల ప్రసాద్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో అప్పు చేసి రూ.5 లక్షలు చెల్లించానని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తన సమస్యను పరిష్కరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
ఆంధ్రా యూనివర్సిటీలో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన టి.రాము విజ్ఞప్తి చేశారు. గత 15 ఏళ్లుగా ఆంధ్రా యూనివర్సిటీలో దివ్యాంగులకు సంబంధించి 80కి పైగా బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన భర్తీ చేసి దివ్యాంగులను ఆదుకోవాలని కోరారు. వైసీపీ హయాంలో యూనివర్సిటీలో ఉన్న దివ్యాంగుల సెల్, దివ్యాంగుల గ్రంథాలయాన్ని కక్షగట్టి మూసివేశారని, తిరిగి పునరుద్ధరించేలా చొరవ చూపాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న కంప్యూటర్ ఆపరేటర్లు, కంప్యూటర్ టీచర్ల ఉద్యోగాల్లో గతంలో పనిచేసిన కంప్యూటర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంప్యూటర్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ ప్రతినిధులు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 2002 నుంచి 2008 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఉపాధ్యాయులుగా నియమితులైన 7,247 మందిని 2013లో అప్పటి ప్రభుత్వం జీవో నెం.840 ద్వారా ఉద్యోగాల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నా తమకు న్యాయం జరగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా తమకు ఏదైనా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు పరిధిలోని జగనన్న కాలనీకి బైపాస్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణంతో పాటు పాటు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. కాలనీకి సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో వైద్యం కూడా అందక ఇటీవల ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సరఫరాతో పాటు కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి కాలనీలో తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.