- సిబ్బందితో పక్షానికోసారి ప్రత్యేకంగా మంత్రి లోకేష్ భేటీ
- వచ్చిన సమస్యలు, పరిష్కారంపై వివరాలు తెలుసుకుంటున్న మంత్రి
- పరిష్కారం కోసం స్వయంగా మంత్రులతో మాట్లాడుతున్న వైనం
- 41వ రోజు నారా లోకేష్ ‘‘ప్రజాదర్బార్’’ లో ప్రజల విన్నపాలు
- అండగా ఉంటానని మంత్రి హామీ
అమరావతి(చైతన్యరథం): ప్రజాదర్బార్‌లో వివిధ వర్గాల ప్రజల నుండి వస్తున్న వినతుల పరిష్కారంపై రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజా దర్బార్ సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై సమస్యల పరిష్కారంలో పురోగతిని తెలుసుకుంటున్నారు. వివిధ శాఖల వారీగా ఎన్ని వినతులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించాం అనే వివరాలు ఆరా తీస్తున్నారు. స్వయంగా తానే సంబంధిత మంత్రులతో మాట్లాడుతూ ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ‘‘ప్రజాదర్బార్’’కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నపాలు అందజేశారు. 41వ రోజు ‘‘ప్రజదర్బార్’’లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన కే.మంగ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇంజనీరింగ్ చదివిన తాను నిరుద్యోగిగా ఉన్నానని, వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్న తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని, విజయ డెయిరీలో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన కె.రాణి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లి సుందరయ్య నగర్ కు చెందిన నాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కుటుంబ పోషణ కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని నవులూరుకు చెందిన ఎలిజాల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
అనారోగ్యంతో భర్త, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయి ఏకాకిగా మారిన తనను ఉన్న కోడలు ఆదరించడం లేదని, కుమారుడి మృతితో ప్రభుత్వం, బీమా ద్వారా అందిన రూ.65 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం అనుభవిస్తూ కోడలు దుర్గాభవాని తనకు అన్యాయం చేసిందని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వడ్డెంగుంట శేషవాణి.. మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. 2012లో వినుకొండ ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పనిచేస్తూ అనారోగ్యంతో భర్త మరణించారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన కుమారుడు 2021లో జరిగిన అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం, బీమా పరిహారం, ఉద్యోగం కోడలికే దక్కింది. ఎలాంటి ఆధారం, ఆస్తిపాస్తులు లేని తనను పట్టించుకోకుండా రోడ్డున పడేసి, కోడలు మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన గాదె గోపాలకృష్ణ.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని, ఇప్పటివరకు రూ.6 లక్షల వరకు ఖర్చు చేశామని, ఇంకా రూ.20 లక్షల వరకు వ్యయమవుతుందని వైద్యులు తెలిపారని కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైవింగ్ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఆర్థిక స్థోమత లేదని, ఆర్థికసాయం అందించి కుమారుడి ప్రాణాలను నిలపాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
అధిక వడ్డీ వసూలుతో తీవ్రంగా నష్టపోయాయని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయవాడకు చెందిన జక్క వీరస్వామి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండే జాస్తి రమణి వద్ద నాలుగేళ్ల క్రితం రూ.2 లక్షల వరకు అప్పుచేశానని, అయితే రూ.10 వడ్డీ అంటూ బెదిరించి ఇప్పటివరకు తనవద్ద నుంచి రూ.7.50 లక్షలు వసూలు చేశారని, మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
దివ్యాంగురాలినైన తనకు ఎలాంటి ఆధారం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంకు చెందిన జి.సుగుణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
గత 9 దశాబ్దాలుగా గ్రామంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం మూసివేసిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి పునరుద్ధరించాలని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తూర్పు పెద్దివారిపాలెం, యద్దనపూడి మండలం పడమర పెద్దివారిపాలెం గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఇంజనీరింగ్ చదివిన తనకు శ్రీ సిమెంట్స్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన నల్లమేకల అశోక చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.