రంపచోడవరం (చైతన్యరథం): గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయటానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని కాకవాడలో ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అడవితల్లి బాట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైద్యం కోసం డోలీ మోతలతో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో ధర కల్పిస్తామని భరోసా కల్పించారు. ఏడు జిల్లాలకు సంబంధించిన గిరిజన ఆవాసాల్లో రూ.1000 కోట్లతో రహదారులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రోడ్లను నిర్మిస్తే విద్య, వైద్యం, రవాణాకు ఉపయోగపడతాయని వివరించారు. ఖర్చు కోసం ఆలోచించకుండా రహదారులను తాము నిర్మిస్తున్నామని తెలిపారు.
రోడ్డు లేని గిరిజన గ్రామం.. అభివృద్ధి లేని కుటుంబం ఉండకూడదన్నారు. ఇప్పటికే 753 తండాలకు 1,258 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం పూర్తిచేశాం. మార్చి 2028 నాటికి పెండింగ్ రహదారులు పూర్తి చేస్తాం. కాంట్రాక్టర్లు ముందుకు రాకున్నా ఒప్పించి పనులు చేపట్టాం.
ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలని.. ఇప్పుడు అభివృద్ధిపైనే దృష్టిసారించామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రూ.7వేల కోట్లతో ఏడు జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రూ.30 వేల కోట్లతో జగ్జీవన్ పనులు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఆయా గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బలం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. పొత్తు ప్రకారం స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. కూటమి నేతలకు ప్రజలంతా సంపూర్ణ మద్దతిచ్చి గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.













