- పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్
- హీరో, అపోలో, భారత్ బయోటెక్, జీఎంఆర్ వంటి ప్రతినిధుల ప్రశంసలు
విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో గురువారం ప్రారంభం కానున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దౌత్యం వేగవంతమైంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ బహుళ జాతీయ కంపెనీల సీఈవోలు, సీఎండీలతో సీఎంతో పాటు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు… హీరో గ్రూప్, భారత్ బయోటెక్, అపోలో హాస్పిటల్స్, సన్ ఇంటర్నేషనల్, రెన్యూ, రాక్వెల్ ఆటోమేషన్, జీఎంఆర్ గ్రూప్‌లకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు, సీఈవోలు పాల్గొన్నారు.రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’ విధానం అత్యంత అభినందనీయమని కంపెనీల సీఈవోలు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్న తీరుపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో భాగస్వామ్యానికి సంసిద్ధత కనబరిచారు.




















