- టీచర్ల బోధనా సామర్థ్యం పెంపుపై దృష్టిసారించాలి
- సాల్ట్ ప్రాజెక్ట్ ద్వారా సమగ్ర శిక్షణ ఇప్పించాలి
- స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఫీడ్‌బ్యాక్‌కు ప్రత్యేక యాప్
- రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా హాజరు శాతం తక్కువెందుకు?
- పెరిగేలా చర్యలు తీసుకోవాలి
- పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్ట్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ ( బోధనా సామర్థ్యం పెంపు) చేయాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లకు శిక్షణ పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలన్నారు. స్కూళ్ల నిర్వహణపై ఫీడ్ బ్యాక్ కోసం రూపొందించిన యాప్‌ల్లో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని చెప్పారు. ఎస్ఎంసీి సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతిస్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. విద్యాకానుకకు సంబంధించి బాలబాలికలకు ఒకేరకమైన ప్యాట్రన్ ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం రూ. వేల కోట్లు ఖర్చుచేస్తున్నా హాజరు శాతం కేవలం 70 మాత్రమే ఉండటానికి గల కారణాలను అన్వేషించాలని, హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్యాగులు, షూస్, డిక్షనరీల నాణ్యతపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సమగ్రశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.