విజయవాడ: అంగన్‌వాడీల ఆందోళనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మద్దతు తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్ లో 22 రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల దీక్షా శిబిరానికి మంగళవారం అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా, మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత వెళ్లి సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 22 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదు అని మంత్రులు చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. పండగలు సైతం సమ్మెలోనే గడిచిపోయాయని.. 22 రోజులుగా అంగన్వాడీలు, 10 రోజులుగా సర్వ శిక్ష అభియాన్, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే వారితో మాట్లాడే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. చిరుద్యోగుల నిరసనల పట్ల ప్రభుత్వం అణిచివేత చర్యలు మాని తక్షణమే ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.