- దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులకు అస్వస్థతపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష
- నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
అమరావతి (చైతన్యరథం): పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎంవో అధికారులు, ఇతర అధికారులతో సమీక్షించారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు.
హాస్టల్లోని మిగిలిన విద్యార్ధులకు కూడా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్టు వివరించారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు… ఆహార పదార్థాల, నీటి నమూనాలు కూడా సేకరించామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని తనకు నివేదించాలన్నారు. ఘటనపై సోమవారంలోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ను అదేశించారు. ఘటనకు కారకులపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.











