న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 9వ తేదీలోగా సుప్రీంకోర్టు తీర్పు రానున్నట్లు స్పష్టమయింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం విచారణకు చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం దానిని నవంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని… ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఆ లోగానే క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం వెలువడుతుందనేది తేలిపోయింది.
అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018 లోని సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారని.. ఈ కేసు, అరెస్ట్ చెల్లదని పేర్కొంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రాష్ట్ర హై కోర్టు కొట్టేయటంతో ఆయన సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. దీనిపై సుప్రీం కోర్టులో ఇంతకు ముందు నాలుగురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన అనంతరం తీర్పు రిజర్వ్ లో ఉంచుతునట్లు ఈ నెల 17వ తేదీన జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ప్రకటించింది.
సెక్షన్ 17 ఏ ఎలాంటి సందర్భాల్లో వర్తిస్తుంది అన్న అంశంపై చంద్రబాబు, సీఐడీ తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక సవరణ చట్టం లక్ష్యాల మేరకు 2018కి ముందు తీసుకున్న నిర్ణయాలకు కూడా 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. సీఐడీ ఈ వాదనను వ్యతిరేకించింది. ఈ చట్ల సవరణ అమల్లోకి రాకముందే ఈ కేసు విచారణ ప్రారంభమయిందని సీఐడీ వాదించింది. 2017లోనే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అమలులో జీఎస్టీ చెల్లింపు ఎగవేత, ప్రభుత్వ ధనం దారి మళ్లింపుపై జీఎస్టీ విజిలెన్స్ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, 2018లో 17 ఏ అమలులోకి రాకముందే ఈ కేసులో విచారణ ప్రారంభమైనట్లుగా భావించాల్సివుంటుందని.. కనుక చంద్రబాబుకు 17 ఏ వర్తించదని సీఐడీ వాదించింది. అయితే.. ఆ లేఖ స్కిల్ సెంటర్లకు పరికరాలు సరఫరా చేసిన సంస్థ పన్నుల ఎగవేతకు సంబంధించిందని, దానితో చంద్రబాబుకుగానీ ఆయన ప్రభుత్వానికి గాని ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో 2021లో ప్రారంభమైన విచారణ ఆధారంగానే తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అందులో కనీసం చంద్రబాబు ప్రస్తావన కూడా లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఆయనకు 17ఏ వర్తిస్తుందని గట్టిగా ప్రతివాదనలు చేశారు. చంద్రబాబు న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు 17ఏ వర్తిస్తుందన్నట్లుగా కనబడుతోందని ఒక దశలో ద్విసభ్య ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించటం గమనార్హం. సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు కొన్ని సందర్భాల్లో అసంబద్ధంగా ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. ఇరు పక్షాల వాదనలు నిశితంగా గమనిస్తున్న పలువురు న్యాయనిపుణులు చంద్రబాబుకు అనుకూలంగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 17ఏ వర్తింపు అంశంపై సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే సీఐడీ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులన్నీ వీగిపోతాయి.
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. తొలుత సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని… ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని తెలిపారు. ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోందని… ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపామని చెప్పారు.
ఈ దశలో జస్టిస్ అనిరుద్ బోస్ జోక్యం చేసుకుంటూ.. చంద్రబాబును మీరు విచారించాలనుకుంటే.. ఆయన ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కదా.. ఫైబర్ నెట్ కేసులో మరోసారి అధికారికంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనికి రంజిత్‌కుమార్ బదులిస్తూ.. ఆయనను విచారించాలంటే ఈ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో మేము కింది కోర్టులో 267 సెక్షన్ కింద వారెంట్ దాఖలు చేశాము. దాని ప్రకారం ఆయనను కస్టడీలోకి తీసుకున్న తరువాత మాత్రమే పోలీసు కస్టడీ కోసం కోరగలమని చెప్పారు.
దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా బదులిస్తూ.. ఇదంతా అబద్ధం.. చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారు.. సెప్టెంబర్ 9న చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నప్పటినుండి ఇప్పటివరకు ఆ విషయమై నా క్లయింట్‌ను ఒక్క సారి కూడా ప్రశ్నించలేదు అని బదులిచ్చారు. ఈ దశలో విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా చెప్పిన జస్టిస్ బోస్ యథాతథ స్థితి కొనసాగించాలన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని… ఆ తర్వాత పైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. చంద్రబాబు పిటిషన్ ను మాత్రం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.