- చైనా వాల్లా జగన్‌రెడ్డి ఇంటికి ఇనుప కంచె
- ప్రజాధనం దుర్వినియోగం చేసి విలాసాలా?
- ఇనుప కంచె చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు
- ప్రపంచంలో ఎవరైనా ఇలా నిర్మించుకున్నారా?
- నియంతలు మాత్రమే ఇలా ఏర్పాటు చేసుకుంటారు
- అది సింహం లక్షణమా…పిల్లి కూడా సిగ్గు పడుతుంది
- రూ.5 వేల కోట్ల ఖర్చుకు ఏం సమాధానం చెబుతావు?
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
మంగళగిరి(చైతన్యరథం): జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విలాసాల కోసం వందల వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేశాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారె డ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ విలాసాలకు నిదర్శనం తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్‌లు. బాత్ టబ్‌లు, కబోర్డ్‌లు ఇలా ఒకటేంటి మసాజ్ టేబుళ్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం చేసి పేదల సొమ్మును ఇష్టానుసారంగా తినేసి సొంత ఖజానాకు చేర్చుకుని మిగిలింది తన విలాసాల కోసం ఖర్చు చేశాడని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ భారీఎత్తున ఇనుప కంచెను పెట్టుకున్నాడు.. ఏ ముఖ్యమంత్రి అయినా, దేశ ప్రధాని, దేశ అధ్యక్షుడైనా ప్రపంచంలో ఇలా ఎవరైనా నిర్మించుకున్నారా? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాదాపు 25 నుంచి 30 అడుగులు ఉంటుంది. జగన్ ఇంటి సమీపంలోనే ఎంతోమంది పేదవాళ్లు తమ కష్టంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. జగన్ ఈ పేద వాళ్ల మొహం చూడకూడదని వాళ్ల ఇళ్లను కూల్చేసి రహదారి చుట్టూ గ్రీనరీ, డిజైనరీ లైట్లు ఏర్పాటు చేసి ఆ రోడ్డులోకి ఏ సామాన్యమైన వ్యక్తిని కూడా అనుమతించలేదు. కానీ కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణించడానికి అనుమ తులిచ్చిందన్నారు.
ఇనుప కంచెను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు
ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా.. ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఎవరూ కూడా ఇంటి చుట్టూ ఇలాంటి ఇనుప కంచెను ఏర్పాటు చేసి ఉండరు. ఇంటి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయడానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. జీఏడీ విడుదల చేసిన అధికార సమాచారం మేరకు ఇనుప కంచె ఏర్పాటుకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారు. భద్రత పేరుతో అమరారెడ్డి కాలనీలోని ఇళ్లను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. దీంతో 318 పేదల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లు కూల్చే రోజు మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిపడేశారు. జగన్ ఆ పేదల ఇళ్లను చూడటానికి ఇష్టం లేక కూల్చేశారు. ఇనుప కంచె ఏర్పాటు చేసుకుని లోపల పిల్లిలా ఉండటం సింహమా.. ఇది సింహం లక్షణమా.. ఇది చూస్తే పిల్లి కూడా సిగ్గు పడుతుంది. జగన్ భయం ఖర్చు 12.85 కోట్లా? గతంలో హిట్లర్ కూడా ఇలానే ఉండేవా డు. రాష్ట్రపతి భవన్ చుట్టూ కూడా ఇలాంటి కంచె లేదు. దేశ అధ్యక్షుడు కంటే జగన్‌కు ఏమైనా సెక్యూరిటీ త్రెట్స్ ఉన్నాయా? రాష్ట్రపతి కంటే జగన్ ఏమైనా వీవీఐపీనా? ఇలాంటి ఇనుప కంచె ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి చుట్టూ కూడా లేదు. లిబియాలో గడాఫి ప్యాలెస్ చుట్టూ, సద్దామ్ హుస్సేన్ ప్యాలెస్ చుట్టూ కూడా పెద్దపెద్ద గోడలు ఉండేవి. ఎవరైతే ప్రజలను అణిచివేసి నియంతలా వ్యవహరిస్తారో వాళ్లు మాత్రమే ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుంటారు. చంద్రబాబు ఇంట్లో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్రతిరోజూ కొన్ని వందల మంది వస్తున్నారు. ఇదీ ప్రజా పరిపాలన.
ప్రజాధనం దుర్వినియోగం చేసి విలాసాలా?
తాడేపల్లి ప్యాలెస్ ఇనుప కంచెకే కాకుండా రంగులకు రూ.3 వేల కోట్లు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలకు రూ.700 కోట్లు, రుషికొండపై విలాసవంతమైన భవనం నిర్మించుకోవ డానికి రూ.600 కోట్లు, సాక్షి దినపత్రికకు ప్రకట నల పేరుతో రూ.500 కోట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలకు రూ.13 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్‌లో వివిధ రకమైన ఖర్చులకు రూ.15 కోట్లు, ఎగ్ పఫ్‌లకు రూ.3.60 కోట్లు ఈ విధంగా దాదాపుగా రూ.5000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు. ఈ రూ.5000 కోట్లు సక్రమంగా ఖర్చు చేస్తే 3 లక్షల మంది వృద్ధులకు 5 సంవత్సరాల పాటు రూ.2500 చొప్పున పింఛన్ ఇవ్వొచ్చు. ఆ డబ్బుతో కావాల్సిన మందులు, నిత్యావసరాలకు ఉపయోగిం చుకునేవారు. జగన్ 3 లక్షల మందికి ద్రోహం చేశాడు. అంతేకాకుండా 6 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి కింద విద్యనభ్యసించే అవకాశం ఉండేది. 8 లక్షల మంది రైతులకు రైతు భరోసా నగదు వచ్చే అవకాశం ఉండేది. లక్షన్నర ఇళ్లు పేదలకు నిర్మించి ఇచ్చే అవకాశం ఉండేది. పేదవాడికి ఇళ్ల పేరుతో కొన్ని వేల కోట్ల కుంభకోణం చేశాడు. జగన్‌రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఎంతోమందికి నష్టం జరిగింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఫర్నిచర్ ను తిరిగి ఇవ్వమంటే చెక్కు రాసి ఇస్తా అంటున్నావు.. ఫర్నిచర్ తిరిగి ఇవ్వడానికి చెక్కు రాయడం కాదు.. రూ.5000 కోట్లకు చెక్కు రాసివ్వు. స్పీకర్ హోదాలో అప్పటి ప్రభుత్వం కోడెల శివప్రసాద్‌కు ఫర్నిచర్ కేటాయిస్తే దానిపై కూడా బ్లూ మీడియాలో లేనిపోని రాతలు రాసి ఆయన్ను దొంగగా చిత్రీకరించి మనోవేదనకు గురిచేసి చేశారు. అకారణంగా తమ అభిమాన నాయకుడు కోడెల శివప్రసాద్‌పై నిందలు వేసి ఆయన మరణానికి కారకుడివ య్యావు. మరి ఇప్పుడు నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఖర్చు చేసిన రూ.5000 కోట్లకు ఏమి సమాధానం చెబుతావు? అని ప్రశ్నించారు. జగన్ ఎలాగో పేదవాడి గురించి ఆలోచించరు..రూ.5000 కోట్లు ఇస్తే ఆ పేదవాడికి మేమే న్యాయం చేస్తాం. లేకుంటే ప్రజలు నిన్ను క్షమించరు అని స్పష్టం చేశారు.