- సాధికారిత చాటేలా ‘నేషనల్ సరస్ మేళా’ నిర్వహణ
- ‘స్వయం ఏపీ’తో గ్రామీణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్
- సెర్ఫ్, మెప్మాపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. దీనికి సెర్చ్, మెప్మా అధికారులు మద్దతుగా నిలవాలని సూచించారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. సంపద సృష్టికి ఎక్కడ, ఎలాంటి అవకాశాలున్నా వినియోగించుకునేలా డ్వాక్రా మహిళలను తీర్చిదిద్దాలన్నారు. 5 లక్షల. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడం లక్ష్యం కావాలని, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఫ్రాంచైజీలు ప్రారంభించినా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటికి పైగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలపడితే…. కోటి కుటుంబాలకు పైగా బలపడినట్టేనని సీఎం చెప్పారు. ఎంటర్ప్రెన్యూర్లు ఆర్థికంగా విజయవంతమైనప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. లక్ష మంది మహిళలు ఒక్కొక్కరు ఏడాదికి రూ.5 లక్షల వ్యాపారం చేయగలిగితే రూ.5వేల కోట్ల ఆర్థిక సామర్థ్యం సాధించినట్టేన న్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమ వారం చంద్రబాబు సెర్చ్, మెప్మా అధికారులతో 5 లక్షల మంది ఎంటర్ప్రైన్యూర్లను తీర్చిదిద్దడం, స్వయం ఏపీ అంశాలపై సమీక్షించారు.
దేశంలోనే స్వయం సహాయక సంఘాలు అంతటి విస్తృతమైన వ్యవస్థ మరొక్కటి లేదని ప్రస్తావించారు. ద్వాక్రా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ చేరుకోవాలని, అదే సమయంలో మరి కొంతమందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని సీఎం సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వేలాది ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక ప్యాకేజింగ్, ఈ- కామర్స్, సిగ్నేచర్ స్టోర్లు, మార్కెటింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ ‘స్వయం ఏపీ’ని తీర్చిదిద్దాలన్నారు. తొలిసారిగా విజయవాడలో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన ‘నేషనల్ సరస్ మేళా 2026’ను విజయవంతం చేయాలన్నారు. మహిళా సాధికారత చాటేలా ఈ మేళాను నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎంటర్ప్రెన్యూర్లను, మహిళా ఎంపీలను ఆహ్వానించాలని నిర్దేశించారు. మరోవైపు సరస్ మేళాకు దేశం నలుమూలల నుంచి వివిధ స్వయం సహాయక సంఘాలు 600 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని అధికారులు వివరించారు. మేళాకు రోజూ లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా 15న ప్రారంభిస్తారని తెలిపారు.
15 నుంచి ‘స్వయం ఏపీ’ విక్రయాలు
ఈ నెల 15వ తేదీ నుంచి సిగ్నేచర్ స్టోర్లు, ఫ్లిప్కార్ట్లో ‘స్వయం ఏపీ’ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు సమీక్షలో అధికారులు వెల్లడించారు. బ్యాంక్ లింకేజీలోనూ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ సభ్యులు ముందున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలు, మార్కెట్ అనుసంధానం, ఆర్థిక వనరులు, శిక్షణ, నాణ్యత ప్రమాణాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు మహిళలకు అండగా బలమైన వ్యవస్థ నెలకొల్పడం… అవకాశాలను గుర్తించి వ్యాపారాలుగా మలిచే కార్యాచరణ చేపట్టడం… రూ.68,585 కోట్ల రుణాలతో మహిళలకు ఆర్థిక మద్దతివ్వడం… మహిళల్లో కెపాసిటీ బిల్డింగ్, వ్యాపార నిర్వహణ కోసం ప్రముఖ సంస్థలతో శిక్షణ అందించడం… 60కి పైగా సంస్థల భాగస్వామ్యంతో సమగ్ర పారిశ్రామిక ప్రణాళిక రూపొందించడం… ఈ ఐదు ప్రధాన అంశాలతో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పటికే వ్యాపారంలో విజయవంతమైన మహిళలను కొత్తగా వ్యాపారంలోకి వచ్చే మహిళలకు మెంటార్లుగా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు సీఎంకి వివరించారు.
గ్రామీణ మహిళా వ్యాపారులకు మద్దతు
గ్రామీణ మహిళా వ్యాపారాలను చిన్న స్థాయి జీవనోపాధి కార్యకలాపాల నుంచి సంపద సృష్టించే సంస్థలుగా మార్చేందుకు ఇంక్యుబేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఐఐఎం విశాఖపట్నం, సెంచూరియన్ యూనివర్సిటీ వంటి సంస్థలతో కలిసి మహిళా వ్యాపారాలకు మెంటార్షిప్, మార్కెట్, రుణం, వనరులు, వ్యాపార నైపుణ్యాల అనుసంధానం చేస్తున్నామన్నారు. మహిళల సొంత బ్యాంకింగ్ సంస్థగా ఉన్న స్త్రీనిధి ద్వారా 4.73 లక్షల మంది మహిళలకు రూ. 4,800 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. ఎస్ హెచి మహిళలు ఇప్పటికే ఆహారం, హస్తకళలు, వస్త్రాలు తదితర రంగాల్లో 23వేలకు పైగా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













