తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. ఆవిర్భవించిన 9నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ నాయకత్వం… నాటి జాతీయ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ కు ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెసేతర పార్టీలకు ఎన్టీఆర్ ఒక దిక్సూచిలా నిలిచారు. రాష్ట్ర రాజకీయాలను మార్చిన ఎన్టీఆర్ సైతం అదే ఆత్మవిశ్వాసంతో దేశ రాజకీయాలను కాంగ్రెస్ గుత్తాధిపత్యం నుంచి విడదీసేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ తాను అధికారంలోకి వచ్చిన ఆరునెలల లోపే మే 28, 1983న తన పుట్టినరోజు సందర్భాన్ని ఇందుకు ఉపయోగించుకున్నారు
విజయవాడలో తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ… జాతీయ స్థాయి నేతలతో విజయవాడలో ఎంజిఆర్ అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. నాటి సమావేశానికి బాబు జగ్జీవన్ రామ్, చండ్ర రాజేశ్వరరావు, హెచ్ ఎన్ బహుగుణ, ఎల్ కె అద్వానీ, శరద్ పవార్, రామకృష్ణ హెగ్డే, మాకినేని బసవ పున్నయ్య వంటి ఉద్ధండులు హాజరయ్యారు.
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 డిసెంబర్ లో జరిగిన లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగడంతో దేశమంతా సానుభూతి పవనాలు వీచాయి. దేశంలోని రాష్ట్రాలన్నింటా కాగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్టీఆర్ సమ్మోహన శక్తి ముందు ఆ సానుభూతి పనిచేయలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలిచి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది తెలుగుదేశం. ఆ రికార్డు సృష్టించిన మొదటి ప్రాంతీయ పార్టీగా చరిత్రలో నిలిచింది.
ఈ విజయంతో దేశవ్యాప్త రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయి. కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒకే గూటి కిందకు చేరే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరో వైపు ఎన్టీఆర్ చరిష్మాను తమ రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోడానికి నేతలు ఉవ్విళ్లూరారు.
1987 హర్యానా శాసనసభ ఎన్నికల్లో కొత్తగా స్థాపించిన లోక్‌దళ్ పార్టీ నేత దేవీలాల్ తనకు మద్దతుగా ప్రచారం చేయమని ఎన్టీఆర్ ను కోరారు. దేవీలాల్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ తన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో వెళ్లారు. ఆ ఎన్నికల్లో లోక్ దళ్ పార్టీ 90కి గాను 85 స్థానాలు సాధించి కాంగ్రెస్ ను 5 స్థానాలకే పరిమితం చేసి రికార్డు సృష్టించింది. దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇదే ఊపుతో సెప్టెంబర్ 17, 1988న తొమ్మిది కాంగ్రెసేతర జాతీయ స్థాయి పార్టీల నేతల ఆధ్వర్యంలో మద్రాసు మెరీనా బీచ్ లో ‘నేషనల్ ఫ్రంట్’ మొదటి సమావేశం జరిగింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగా డిసెంబర్ 1989 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. నాడు వీపీ సింగ్ ప్రధానిగా, దేవీలాల్ ఉపప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ను ప్రధాని పదవి చేపట్టమని ఫ్రంట్ నేతలు కోరినా ఎన్టీఆర్ తెలుగు వారి సేవకే ప్రాధాన్యమిచ్చారు.
ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు, 1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ, ఆ తర్వాత ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ప్రముఖ పాత్ర పోషించారు.
తరువాత 1999లో బి.జె.పి అధ్వర్యంలోని ఎన్.డి.ఎ కు జాతీయ కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు… 29 పార్లమెంటరీ సీట్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించి సంకీర్ణ ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజపాయ్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు.
దళిత వర్గానికి చెందిన కె ఆర్ నారాయణన్, మైనారిటీ వర్గానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం లను రాష్ట్రపతులుగా చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు చంద్రబాబు.
ఎన్టీఆర్ అయినా చంద్రబాబు అయినా… ఈ కింగ్ మేకర్స్ ఇద్దరికీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా… తెలుగు ప్రజల పై మమకారంతో రాష్ట్ర స్థాయికి పరిమితమై పోయారు.
కాకపోతే కేంద్రంలో తనకున్న పలుకుబడితో తన రాష్ట్రానికి కావాల్సిన వాటిని ఎన్నింటినో తెచ్చుకోగలిగారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఏర్పాటైన ఐఆర్డీఏ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైటెక్సిటిలు మాత్రమే కాదు… ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కూడా ఆ కాలంలోనే చంద్రబాబు సాధించారు. అంతేకాదు 2002లో 32వ జాతీయ క్రీడలను, 2003లో మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ ను నిర్వహించి తన పాలనా స్థాయిని, సమర్థతను ప్రపంచ స్థాయిలో చెప్పుకునేలా చేసారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, యాసర్ అరాఫత్, ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ వంటి ప్రముఖులు తమ భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సందర్శనను తప్పనిసరిగా చేర్చుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని తీసుకువెళ్లారు చంద్రబాబు
© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.