కాకినాడ: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వెళ్లి గురువారం టీడీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ కలిశారు. నెహ్రూకు ముద్రగడ స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకెళ్లారు. కాపులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ దృష్టికి ఈ సందర్భంగా నెహ్రూ తీసుకెళ్లారు. ఈ భేటీ అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం, తాను కలిస్తే కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటామన్నారు. తమ మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయన్నారు. అంతకుముందు ముద్రగడను జనసేన నేతలు కలిశారు.
ఇలా ఉంటే ముద్రగడ పద్మనాభంతో టీడీపీ, జనసేన నేతల వరుస భేటీలపై ఆయన కుమారుడు గిరిబాబు స్పందించారు. తాను, తన తండ్రి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామన్నారు. ఏ పార్టీలో చేరాలా అనేది ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని తెలిపారు. మరిన్ని చర్చలు జరుగుతాయన్నారు.